CM Jagan: 'రైతు నష్టపోకూడదనేదే ప్రభుత్వ లక్ష్యం' - అన్నదాతలకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసిన సీఎం జగన్
Ap News: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం జగన్ అన్నారు. వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన వారికి పరిహారం విడుదల చేశారు.
CM Jagan Released Input Subsidy: రాష్ట్రంలో రైతన్నలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని.. వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి విపత్తుల వల్ల ఏ రైతూ నష్టపోకూడదనేదే తమ లక్ష్యమని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ - 2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్ లో సంభవించిన మిగ్ జాం తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1294.58 కోట్ల పరిహారాన్ని బుధవారం బటన్ నొక్కి విడుదల చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు క్రమం తప్పకుండా పరిహారం అందిస్తున్నామని.. అన్నదాతలకు బాసటగా నిలిచేందుకు గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని వివరించారు.
'రైతు పక్షపాత ప్రభుత్వం'
వైసీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ ఈ సందర్భంగా అన్నారు. 'సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఇ - క్రాప్ కింద నమోదు చేస్తున్నాం. ఎవరు ఏ పంట వేశారు.?, ఎంత సాగు చేశారు.? అనే పూర్తి డేటా అందుబాటులోకి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఎవరైనా నష్టపోతే వారి జాబితాను సచివాలయాల్లోనే ప్రదర్శిస్తున్నాం. ఇలాంటి గొప్ప వ్యవస్థను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తెచ్చాం. అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకూ అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందిస్తున్నాం. తుపాను కారణంగా రంగు మారిన 3..25 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సుమారుగా రూ.1300 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ కింద ఇస్తున్నాం. తొలిసారిగా 58 నెలల కాలంలో ఉచిత బీమా కింద రూ.7,802 కోట్లు రైతులకు చెల్లించాం. నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. అలాంటి పరిస్థితుల్లోనూ 54 లక్షల మందికి పైగా రైతులకు బీమా అందించాం. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు మండలాలను ప్రకటించాం. వారికి ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం.' అని వివరించారు.
అన్నదాతలు ఎక్కడా నష్టపోకూడదనే ఉద్దేశంతోనే వారు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తెచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. ఉలవలు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, జొన్న వంటి పంటలకు సంబంధించి విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. తుపాను వల్ల డిసెంబర్ 4న రైతులు పంట నష్టపోతే డిసెంబర్ 8కల్లా వారికి సబ్సిడీపై విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశామని వివరించారు.
మరోవైపు, వెలిగొండ ప్రాజెక్టును సీఎం జగన్ బుధవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని వ్యాఖ్యానించారు. 'మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్‌తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్‌తో నాలుగు లక్షల 47 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.' అని పేర్కొన్నారు.