Chiru Rajya Sabha : చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చారా ? నిజమా ? మైండ్ గేమా ?
చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం ఊపందుకుంటోంది. అయితే ఇది నిజమా ? లేక పొలిటికల్ మైండ్ గేమా ? అన్నదానిపై స్పష్టత లేదు.
చిరంజీవికి సీఎం జగన్ రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ ఇచ్చారా ? దీనికి చిరంజీవి ఎలా స్పందించారు ? . ఇప్పుడీ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సీఎం జగన్ ఆహ్వానం మేరకు చిరంజీవి లంచ్ మీటింగ్‌కు వచ్చారు. మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. పూర్తిగా సినీ పరిశ్రమ సమస్యలపైనే మాట్లాడామని చెప్పారు. ఎక్కడా రాజకీయసంభాషణ జరిగినట్లుగా చెప్పలేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ వర్గాలు మాత్రం చిరంజీవికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే దీనిపై చిరంజీవి ఎలాంటి స్పందన వ్యక్తం చేశారన్న విషయం మాత్రం చెప్పలేదు.
Also Read: పవన్ కల్యాణ్ న్యాయం కోసమే పోరాడతాడు - చిరంజీవి
చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం !
జూన్‌లో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. నాలుగు కూడా వైసీపీకి ఏకగ్రీవం అవుతాయి. ఈ క్రమంలో కొత్త వర్గాలను ఆకట్టుకోవడానికి.. జనసేన పార్టీ ప్రభావాన్ని వీలైనంత వరకూ తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో కాపు వర్గాలు యాక్టివ్ అవుతున్నాయి. ప్రత్యేక పార్టీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు వైఎస్ఆర్‌సీపీ అధినేత వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
ప్రత్యక్ష రాజకీయాలకు చిరంజీవి దూరం !
చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన గతంలో కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే సభ‌్యత్వం ముగియక ముందే రాజకీయాలకు దూరం ఉండటం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత పూర్తిగా దూరమయ్యారు. ఓ ప్రత్యేక కార్కక్రమంలో ఆయన అభిమానులంతా జనసేనలో చేరారు. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై ఆయనకు ఆసక్తి ఉందో లేదో స్పష్టత లేదు. ఈ ప్రచారంపై చిరంజీవి క్యాంప్ కూడా ఇంత వరకూ ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు.
రాజ్యసభ ఆఫర్ బీజేపీ నుంచి ఎప్పుటి నుంచో ఉందా !?
చిరంజీవి రాజ్యసభ సీటుకు అంగీకరిస్తే వైఎస్ఆర్‌సీపీలో చేరాల్సి ఉంటుంది. రాజ్యసభ సీటు కోసం చిరంజీవి వైసీపీలో చేరుతారని రాజకీయవర్గాలు భావించడం లేదు. ఎందుకంటే చిరంజీవి వస్తానంటే .. రాజ్యసభ మాత్రమే కాదు అంతకు మించి పదవి ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఆయనను స్వయంగా అమిత్ షా ఆహ్వానించారని కూడా చెబుతూంటారు. అదే స/మయంలో చిరంజీవి లాంటి మెగాస్టార్.. ఓ ప్రాంతీయ పార్టీలో మరో నేత కింద పని చేయడం కష్టమే. అదే జాతీయ పార్టీలో అయితే స్కోప్ ఉంటుంది. ఎలా చూసినా.. చిరంజీవి రాజ్యసభ ఇవ్వడానికి వైఎస్ఆర్‌సీపీ సిద్ధంగా ఉన్నా.. ఈ విషయంలో చిరంజీవి మాత్రం సానుకూలత చూపిస్తారని అనుకోవడం లేదు.
Also Read: "టాలీవుడ్ బాస్ " పాత్రకు చిరంజీవి న్యాయం చేయలేకపోతున్నారా..!?
మైండ్ గేమ్ రాజకీయమా !?
అయితే చిరంజీవి రాజ్యసభ అనే ప్రచారం మొత్తం వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మకంగా చేస్తున్నదేనని జనసేనకు చెందిన కొంత మంది నేతలు చెబుతున్నారు. కేవలం కాపు వర్గంలో గందరగోళం సృష్టించడానికి మీడియాకు ఇలా లీకులు ఇస్తున్నారంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు రోజుల కిందట చిరంజీవి గురించి ప్రస్తావించారు. తనతో చిరంజీవి ఇప్పుడు కూజా బాగానే ఉంటున్నారని.. రాజకీయాలనేవి పార్ట్ ఆఫ్ గేమ్ అని వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబుకు మళ్లీ చిరంజీవి దగ్గరయ్యే ప్రమాదం ఉందన్న కోణంలోనూ ఇలాంటి ఆఫర్‌ను ప్రచారంలో పెట్టినట్లుగా మరికంత మంది విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే చిరంజీవి కేంద్రంగా ఏపీ పాలిటిక్స్‌లో మైండ్ గేమ్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయని అనుకోవచ్చు. దీనిపై చిరంజీవి స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి !
Also Read: పది రోజుల్లో సమస్యకు పరిష్కారం - చిరంజీవికి సీఎం జగన్ హామీ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి