CM YS Jagan: 8 రోజుల పాటు పెన్షన్ పంపిణీ - పథకాల అమలుకు సీఎం జగన్ ప్రత్యేక కార్యక్రమాలు !
Andhra news : ప్రభుత్వ పథకాల అమలుకు సీఎం జగన్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . దీనిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Implementation of Government Schemes : ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. పెన్షన్ కానుక, ఆసరా, చేయూత పథకాల అమలుతో పాటు అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని.. ఎక్కడా పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు.
8 రోజుల పాటు పెన్షన్ కానుక పంపిణీ ఉత్సవాలు
జనవరి 1వ తేదీ నుంచి వృద్ధుల పెన్షన్ కానుక రూ.3వేలకు పెంచుతున్నామని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని.. తెలిపారు. జనవరి 1 నుంచి 8వ తేదీ వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి, ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చామన్నారు. ఆదివారమైనా, పండుగైనా సరే ఒకటో తారుఖీన చిక్కటి చిరునవ్వుతో పెన్షన్‌ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగామన్నారు.
పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా నేను 3వ తారీఖున కాకినాడలో పాల్గొంటున్నాను. అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ప్రారంభం అవుతుంది.. ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలి.. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి.. దీనిపె షెడ్యూలు చేసుకోవాలి అన్నారు.
జనవరి 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ,
జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. జనవరి 19 విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు సీఎం జగన్.. రూ.404 కోట్లతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం.. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం. సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి.. ప్రతి సచివాలయం పరిధిలోకూడా సమావేశాలు పెట్టండి.. ప్రతి సచివాలయం నుంచి 5 మంది అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి.. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతాం.. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం నడుస్తుంది.. గ్రామ స్థాయిలో గొప్ప వ్యవస్థను తీసుకు వచ్చాం.. గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చాం.. ఇదొక గొప్ప మార్పు.. ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం నిలుస్తుందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
జనవరి 23 నుంచి ఆసరా
జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుంది. నాలుగో కార్యక్రమం వైయస్సార్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది.. ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.. అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది.. ఈ కార్యక్రమం జరిగే లోపే దాదాపు 1.7 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు.. 66,34,742మందికి రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి అన్నారు.
చెప్పినవన్నీ చేస్తున్నామన్న సీఎం జగన్
మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేసిందని స్పష్టం చేశారు సీఎం జగన్.. ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో అందరికీ తెలిసిందే.. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలి.. ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. ఫిబ్రవరి 15-16 తేదీల్లోనే ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు.. వాటితోపాటు లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు ఇస్తాం అన్నారు. కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి.. మహిళా సంఘాల కార్యకలాపాలు తెలియజేసే స్టాల్స్‌ను పెట్టాలి.. ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం ఉంటుందని తెలిపారు.