Nara Lokesh : ఢిల్లీలో నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు - ఎప్పుడు రమ్మన్నారంటే ?
నారా లోకేష్‌కు సీఐడీ ఢిల్లీలో నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ నాలుగో తేదీన ఉదయం 10 గంటలకు గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు జారీ చేశారు. 14వ తేదీన ఉదయం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇటీవల ఏ 14గా లోకేష్ పేరు చేర్చారు. అయితే తర్వాత ఎఫ్ఐఆర్ మార్చామని హైకోర్టుకు చెప్పారు.. ఎలా మార్చారు.. సాక్షిగా మార్చారా లేకపోతే.. నిందితుడిగానే ఉంచారా అన్నదానిపై స్పష్టత లేదు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను అరెస్టు చేయబోమని ఆయనపై ఎఫ్ఐఆర్‌ను దర్యాప్తు అధికారి మార్చారని ఏజీ హైకోర్టుకు చెప్పారు. దీంతో అరెస్టు చేసే ప్రశ్నే ఉండదు కాబట్టి.. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. అలాగే స్కిల్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ నారా లోకేష్‌ను నిందితుడుగా చేర్చారు. దీంతో ఆ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ నాలుగో తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే నారా లోకేష్‌కు నోటీసులు ఇవ్వడానికి నేరుగా సీఐడీ అధికారులు ఢిల్లీకి వచ్చారు. శుక్రవారమే వారు ఢిల్లీకి వచ్చారు. కానీ నారా లోకేష్‌కు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మరో వైపు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో సీఐడీ అధికారులకు నారా లోకేష్ ఎక్కడున్నారో తెలియడం లేదని.. ప్రచారం ప్రారంభించారు. అయితే తాను ఢిల్లీ వచ్చినప్పటి నుండి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. లోకేష్ అక్కడే ఉన్నారు.
ఈ విషయాన్ని నారా లోకేష్ స్పష్టం చేశారు. దీంతో సీఐడీ అధికారులు శనివారం సాయంత్రం ఢిల్లీలో తాము బస చేసిన హోట్ల నుంచి ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వచ్చారు. ముగ్గురు అధికారులు గల్లా జయదేవ్ నివాసంలోకి వెళ్లి లోకేష్ కు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ నాలుగో తేదీన ఉదయం పది గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో నారా లోకేష్ కు వాట్సాప్ లోనూ నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. తాను నోటీసులు అందుకున్నానని.. నారాలోకేష్ వాట్సాప్ లో రిప్లయ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి వాట్సాప్ లో నోటీసులు ఇచ్చే సౌలభ్యం ఉంటే.. ప్రత్యేకంగా ఓ టీమ్ ఢిల్లీకి వెళ్లి ... నేరుగా నోటీసులు ఇచ్చి హడావుడి చేయాల్సిన అవసరం ఏమిటన్నది ఆశ్చర్యకరంగా మారింది.
సుప్రీంకోర్టులో చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో మూడో తేదీన జరగనుంది. ఈ విచారణ కోసం నారా లోకేష్ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. దేశంలోనే ప్రముఖ లాయర్ అయిన హరీష్ సాల్వే చంద్రబాబు కోసం వాదిస్తున్నారు. మూడో తేదీన విచారణ పూర్తయిన తర్వాత లోకేష్ ఏపీకి తిరిగి రావాలనుకున్నారు. ఈ లోపు సీఐడీ అధికారులే నోటీసులు ఇచ్చారు. నాలుగో తేదీన లోకేష్ సీఐడీ విచారణకు హాజరవుతారని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.