AP Tickets Issue: టికెట్ల సమస్యకు నేటితో శుభం కార్డు పడే ఛాన్స్! ఎవర్ని పిలిచారో తెలీదు, ఎయిర్‌పోర్టులో చిరంజీవి కీలక వ్యాఖ్యలు
సీఎంను కలిసిన వారిలో చిరంజీవి, రాజమౌళి, మహేశ్ బాబు, ప్రభాస్ కొరటాల శివ, పోసాని క్రిష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి, అలీ, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎంఓ నుంచి తనకు మాత్రం ఆహ్వానం అందిందని ఇంకా ఎవరెవరికి ఆహ్వానాలు అందాయనే విషయం తనకు తెలియదని అన్నారు. ‘‘సీఎంతో సమావేశానికి నాకు మాత్రం ఆహ్వానం అందింది. మిగతా వారు ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. మీ మీడియా ద్వారానే వారు వస్తున్నారన్న విషయం నాకు తెలిసింది. టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలకు ఇవాళ్టితో శుభం కార్డు పడుతుంది. సీఎం జగన్‌తో సమావేశం ముగిసిన తర్వాత అన్ని విషయాలు చెబుతాం.’’ అని చిరంజీవి అన్నారు. అయితే, గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి మహేశ్ బాబు, కొరటాల శివ, రాజమౌళి, ప్రభాస్ రాగా.. మీడియాతో మాట్లాడేందుకు వారు నిరాకరించారు.
గురువారం ఉదయం ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎంను కలిసిన వారిలో చిరంజీవి, రాజమౌళి, మహేశ్ బాబు, ప్రభాస్ కొరటాల శివ, పోసాని క్రిష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి, అలీ, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. భేటీ అనంతరం వీరు ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
అంతకుముందు, సీఎంను కలిసేందుకు సినీ ప్రముఖులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో చిరంజీవి, రాజమౌళి, కొరటాల శివ, మహేశ్ బాబు, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరోవైపు, పోసాని, ఆర్.నారాయణ మూర్తి, అలీ ముందే విజయవాడ చేరుకున్నారు. వీరంతా కలిసి ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునకు కూడా ఆహ్వానాలు అందినా వేర్వేరు కారణాల వల్ల వారు హాజరు కాలేకపోయినట్లు తెలిసింది.
టికెట్ల వ్యవహారానికి నేటితో ఫుల్ స్టాప్ పడుతుంది: అల్లు అరవింద్
ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారానికి నేటితో ఫుల్‌స్టాప్ పడే అవకాశం ఉందని నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్‌లో అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో గురువారం ఉదయం ఇండస్ట్రీ పెద్దలు సమావేశం కావడానికి ముందే ఆయన ఈమేరకు స్పందించారు. ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ భేటీపైనే ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలకు నేటితో ముగింపు పడొచ్చని అందరూ ఆశిస్తున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలకు నేటితో ఎండ్ కార్డ్ పడుతుందని ఆశిస్తున్నాం. ఇండస్ట్రీకి మేలు జరిగేలా ప్రకటన వస్తుందని భావిస్తున్నా. మా కుటుంబం నుంచి చిరంజీవి వెళ్లారు. కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని అల్లు అరవింద్ అన్నారు.