God Father No Politics : గాడ్‌ఫాదర్ డైలాగులతో భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను - ఏపీ నేతలకు ముందుగానే చిరంజీవి క్లారిటీ !
గాడ్ ఫాదర్ డైలాగులు ఎవరినీ ఉద్దేశించినవి కావని .. కథ ప్రకారమే ఉంటాయని చిరంజీవి స్పష్టం చేశారు. సెటైర్లు వేశారని ఎవరైనా అనుకుంటే తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
God Father No Politics : చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాల్లోనూ ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆ సినిమా మొత్తం రాజకీయం చుట్టూ తిరుగుతుంది. అంతే కాదు ముఖ్యమంత్రి చనిపోతే ఆయన కుటుంబంలో జరిగే పరిణామాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. చనిపోయిన సీఎం కుటుంబసభ్యుల సమస్యలు.. ఆయనను గాడ్ ఫాదర్‌ా భావించే ఆజ్ఞాతంలో ఉండే హీరో ఎలా పరిష్కరించాడన్నదే కథ. ఈ కథలో హీరో రాజకీయాల్లోకి రాడు. చనిపోయిన సీఎంకు వారసుడిగా ఆయనే రావాలని చాలా మంది పట్టుబడతారు కానీ రారు. ఈ కథ చూసిన వారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు అడుగడుగునా గుర్తుకు వస్తాయి. పైగా ఈ సినిమాను చిరంజీవి రీమేక్ చేయడంతో ఇప్పుడు అందరికీ ఆసక్తి ఏర్పడింది.
గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఏపీ అధికార పార్టీని టార్గెట్ చేశారని.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రమోట్ చేశారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రోమోలలో కొన్ని రాజకీయ పార్టీలను పోలినట్లుగా జెండాలు , బ్యానర్లు ఉండటం ఇలాంటి వాటికి మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే చిరంజీవి మాత్రం తన సినిమాలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఓ పార్టీని విమర్శించడానికి లేదా ..మద్దతివ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని స్పష్టం చేశారు. గాడ్ ఫాదర్ సినిమాలో చూపించిన పార్టీ గుర్తులకు, జనసేన పార్టీ గుర్తుకు ఎటువంటి సంబంధం లేదు. గాడ్ ఫాదర్ సినిమాలో అవి డిజైన్ చేసిన వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు కాదు... వాళ్లకు ఇక్కడ రాజకీయాలపై అవగాహన లేదని స్పష్టం చేశారు.
అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగుల విషయంలోనూ .. ఎవరైనా తమనే అన్నారని భుజాలు తడుముకుంటే తానేం చేయలేనని స్పష్టం చేశారు. సినిమాలో కథకు అనుగుణంగా రచయితలు డైలాగులు రాశారని.., ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలను టార్గెట్ చేసి ఎలాంటి డైలాగులు రాయలేదన్నారు. ఈ విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామన్నారు. అయినప్పటికీ తమ సినిమాలో డైలాగులు .. తమను ఉద్దేశించే రాశారని ఎవరైనా భుజాలు తడుముకుంటే అది వారి సమస్య అని తేల్చేశారు. ఇటీవలి కాలంలో సినిమాల్లో వచ్చే డైలాగులను ఫలానా రాజకీయ పార్టీని ఉద్దేశించే అన్నారంటూ సోషల్ మీడియాలో విశ్లేషణలు చేయడం ఎక్కువైంది. అందుకే చిరంజీవి ఈ క్లారిటీ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
రాజకీయాలకు పూర్తిగా దూరమైన చిరంజీవి పొలిటికల్ కామెంట్లకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల వైఎస్ఆర్‌సీపీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ప్రచారం జరిగినప్పుడు కూడా ఆయన తేలిగ్గా తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి విరమించుకున్నానని అలాంటి ప్రతిపాదనలేవి తనకు రావన్నారు. తాను పూర్తిగా సినిమాలకే పరిమితమైనందున.. సినిమాల్లో రాజకీయాలు చొప్పించాలని అనుకోవడం లేదని చెబుతున్నారు. మొత్తంగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలను రాజకీయ కథగానే చూడాలి కానీ.. ప్రస్తుత రాజకీయ పార్టీలు, నేతలతో పోల్చుకుని భుజాలు తడుముకోవద్దని నేరుగానే చెప్పినట్లయింది.