Sajjala : సమస్యను ఉద్యోగులే జఠిలం చేస్తున్నారు.. పరిష్కరించుకునే ఉద్దేశం వారికి లేదన్న సజ్జల !
ఉద్యోగుల తీరుపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకుండా వారే జఠిలం చేస్తున్నారని విమర్శించారు.
ఉద్యోగులు చేసిన చలో విజయవాడ కార్యక్రమంపై మంత్రులంతా ఓ రకంగా .. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మరో రకంగా స్పందిస్తున్నారు. ఉద్యోగులకు సమస్యను పరిష్కరించుకోవాలని లేనట్లుగా ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఉద్యోగులు రాను రాను సమస్యను జఠిలం చేస్తున్నారని విమర్శించారు. చర్చలకు రావాలని ప్రతి రోజూ పిలుస్తున్నామని కానీ వారు రావడం లేదన్నారు. చర్చలతో తప్ప సమస్య ఎలా పరిష్కారం అవుతుందని ప్రశ్నించారు.
పీఆర్సీ ప్రకటించినప్పుడు చప్పట్లు .. ఇప్పుడు తాడోపేడో ఉద్యమం ! ఈ మధ్యలో ఏం జరిగింది ?
ప్రభుత్వ ఉద్యోగులకు తమ ప్రభుత్వం చాలా మేలు చేసిందన్నారు. ఉపాధ్యాయులకు గత ప్రభుత్వాలు చేయనంత మేలు చేశామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత సహా ఎన్నో చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రభుత్వ పరిధిలో ఉద్యోగులకు చేయగలిగినంత చేశామని సజ్జల స్పష్టం చేశారు. ఉద్యోగులు చర్చలకు రావాలన్నారు. చలో విజయవాడకు పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలి వచ్చిన అంశంపై ఆయన సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల్ని కట్టడి చేయడంలో పోలీసుల వైఫల్యం, ఉద్యోగ సంఘాల నేతల ప్రకటనలు, ఐదో తేదీ నుంచి సహాయ నిరాకరణ చేపడతామన్న ఉద్యోగుల కార్యాచరణపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.
తగ్గేదే లే.. 5 నుంచి పెన్ డౌన్.. 7 నుంచి సమ్మె .. ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి అల్టిమేటం !
జీవోల్లో మార్పులు చేస్తామని చలో విజయవాడ జరుగుతున్న సమయంలో సీనియర్ మంత్రి, చర్చల కమిటీలో సభ్యుడు అయిన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మంత్రులు కూడా ఆ తర్వాత ఉద్యోగులంతా తమ కుటుంబసభ్యులేనంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఉద్యోగులే సమస్యను పరిష్కారం కాకుండా చేసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. చర్చలకు రావడం లేదని ఆరోపిస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమం తర్వాత కూడా సజ్జల అదే విధంగా మాట్లాడటంతో ముందు ముందు ఎవరూ తగ్గరని భావిస్తున్నారు. అటు ప్రభుత్వం , ఇటు ఉద్యోగ సంఘాలు అదే పట్టుదల ప్రదర్శిస్తే సమ్మె ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉద్యోగులు మాత్రం సజ్జల ఎవరని..నేరుగా ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్ర ఉద్యోగుల్లో ఇంత ఆవేశం ఎందుకు ? జీతాలు పెరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదన అబద్దమేనా ?