AP Employees : ఆంధ్ర ఉద్యోగుల్లో ఇంత ఆవేశం ఎందుకు ? జీతాలు పెరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదన అబద్దమేనా ?
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఎప్పుడూ లేనంత ఆవేశంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు. కొత్త పీఆర్సీ వద్దే వద్దంటున్నారు. జీతాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం చేస్తున్న వాదన అబద్దమంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఆ విషయం విజయవాడలో నిర్వహించిన "చలో విజయవాడ"లో వారి ఆవేశంతోనే స్పష్టమయింది. ఉద్యోగులకు ఎప్పుడూ చేయనంత మేలు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఎవరూ చేయనంత అన్యాయం చేశారని ఉద్యోగులు అంటున్నారు. ఇంతకూ ఎవరి వాదన కరెక్ట్..? జీతాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ?
రూ. 10 వేల కోట్ల మేర ఉద్యోగులకు లబ్ది చేస్తున్నామన్న ప్రభుత్వం !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీని అత్యుత్తమ ప్యాకేజీగా చెబుతోంది.పొరుగు రాష్ట్రం కన్నా ఎక్కువగా ఇచ్చామని లెక్కలు చెబుతున్నారు. ఈ పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ. పది వేల కోట్ల భారం పడుతోందని వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పీఆర్సీ అంశాన్ని డీల్ చేస్తున్న ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగుల జీతం తగ్గదు.. పెరుగుతుందని లెక్కలు చెబుతున్నారు. అయినా ఉద్యోగులు ఇంకేదో ఆశిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు.
అన్నీ తగ్గిస్తే జీతం ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు !
27 శాతం ఉన్న ఐఆర్‌ను ఫిట్‌మెంట్ వచ్చే సరికి 23 శాతాన్ని ఖరారు చేశారు. అంటే నాలుగు శాతం వరకూ తగ్గిపోయింది. హెచ్‌ఆర్ఏ తగ్గించారు. సీసీఏను రద్దు చేశారు. అలవెన్స్‌లన్నీ కోతేశారు. ఇన్నీ కోతేసిన తర్వాత కూడా జీతం పెరుగుతుందని ఏ లెక్కలో చెబుతున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి మద్దతుగా ఉండే కొన్ని మీడియాల్లో సోషల్ మీడియాల్లో ఉద్యోగుల కొత్త పే స్లిప్‌లు వైరల్ అవుతున్నాయి.గత జీతంతో పోలిస్తే ఈనెల జీతం పెరిగిందని అందులో చూపిస్తున్నారు. ఉద్యోగులు మాత్రం ఈ పేస్లిప్ లెక్కలన్నీ ఫేక్ అని అంటున్నారు.
రూ. 10వేల కోట్ల భారం ఎందుకు పాత జీతాలే ఇమ్మంటున్న ఉద్యోగులు !
ప్రభుత్వం తమపై రూ. పదివేల కోట్ల భారం కొత్త పీఆర్సీ వల్ల పడుతుందని చెబుతున్నారని అలాంటప్పుడు తమకు పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ కోరికను మన్నించి రూ. పది వేల కోట్లను మిగుల్చుకోవచ్చుగా అని సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు అంత ఎక్కువ ఖర్చు పెట్టుకుటోందని ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ పదివేల కోట్ల వెనుక ఉన్నది లెక్కల మాయాజాలమేనని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగులు వద్దన్నా సరే తాము ప్రయోజనాలు కల్పిస్తామనే వాదన వినిపిస్తోంది.
పెరిగిన జీతాలు ఉద్యోగులు వద్దంటున్నారంటే ఏదో మతలబు ఉన్నట్లేగా ?
ఉద్యోగులు పెంచిన జీతాలు వద్దు బాబోయ్ అంటున్నారు . తాము అదనంగా రూ. పది వేల కోట్ల మేరకు ఉద్యోగులకు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇది వినేవారికి కాస్త విచిత్రంగా ఉంటుంది. నిజంగానే ఇలా పెంచిన జీతాలు మాకు వద్దు అని సమ్మెలోకి ఉద్యోగులు వెళ్లడం ఇదే మొదటి సారి కావొచ్చు. పెంచింది సరిపోలేదని ఇంకా పెంచాలని అడుగుతూ వెళ్తారేమో కానీ పెంచింది మీరే ఉంచుకోండి మా పాత జీతాలు మాకివ్వండని అడుగుతున్న వైనం మాత్రం అందర్నీ కాస్త ఆశ్చర్య పరుస్తోంది. ఈ పీఆర్సీ వల్ల జరిగే నష్టం కొంచెం కాదని.. ఉద్యోగ జీవితం మొత్తం ఉంటుందని వారు ఆందోళన చెందుకున్నారు. అందుకే నిరసన బాట పట్టారు.