Sajjala On Supreme Court : సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం - మూడు రాజధానులకు ప్రజామోదం ఉందన్న సజ్జల !
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రజామోదంతోనే మూడు రాజధాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Sajjala On Supreme Court : అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో 3 నుంచి 7 అంశాలపై జనవరి 31వ తేదీ వరకూ సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. తమ పార్టీ తరపున ఆ తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సామాజిక న్యాయానికి భిన్నంగా గతంలో హైకోర్టు తీర్పు ఉందన్నారు. మూడు రాజధానుల నిర్ణయం సామాజిక న్యాయం చేసేదిగా ఉందన్నారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలందరి ఆమోదం ఉందని స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని వాటిలో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించిందన్నారు. ప్రజల మద్దతు ఉందని చెప్పడానికి ఇంత కన్నా ఏం కావాలని ప్రశ్నించారు. ప్రజల ఆలోచననే ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసిందన్నారు.
సుప్రీంకోర్టు స్టే విధించిన అంశాలు ఇవీ
హైకోర్టు ఇచ్చిన తీర్పులో మూడు నుంచి ఏడు అంశాలపై సుప్రీంకోర్టు జనవరి 31వరకు స్టే విధించింది.
అవేమిటంటే...
3. CRDA యాక్ట్ సెక్షన్ 58 ప్రకారం రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రాసెస్ తీర్పు వచ్చిన తేదీ నుంచి నెలరోజుల్లో పూర్తిచేయాలి
4. APCRDA యాక్ట్ సెక్షన్ 61 ప్రకారం టౌన్ మాస్టర్ ప్లానింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, CRDA కలిసి పూర్తి చేయాలి
5. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఫామ్ 9.14 ప్రోవిజన్ - CRDA యాక్ట్ 2015లోని నిబంధనల ప్రకారం 6 నెలల్లో అమరావతి కేపిటల్ సిటీ, కేపిటల్ రీజియన్ నిర్మాణం చేపట్టాలి
6. ప్రభుత్వం మరియు CRDA కలిసి రోడ్లు, తాగునీరు, ప్రతిప్లాట్‌కు విద్యుత్ కనెక్షన్, డ్రైనేజి సహా ఏర్పాటు చేసిన అమరావతి కేపిటల్ సిటీ నివాసయోగ్యంగా మార్చాలి
7. రాష్ట్ర ప్రభుత్వం మరియు APCRDA కలిసి భూములిచ్చిన రైతులకు ప్రామిస్ చేసినట్టుగా అమరావతి కేపిటల్ రీజియన్‌లో స్థలాలు 3 నెలల్లోగా కేటాయించాలి
తదుపరి విచారణ జనవరి 31న !
వీటన్నింటిపై స్టే ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏలు అక్కడ జరుగుతున్న అభివృద్ధిపై ఎప్పటికప్పుడు వేర్వేరు అఫిడవిట్లు సమర్పించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా?. మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానిచింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? అంటూ మందలింపు వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ తరుణంలో.. ఏపీ హైకోర్టు 7 అంశాలతో ఇచ్చిన తీర్పులోని.. చివరి ఐదు అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.