AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్రం స్పష్టత
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని తేల్చిచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఎలాంటి సందేహం లేదంటూ పార్లమెంట్‌లో ప్రకటన చేసింది. ఏపీతోపాటు 28 రాష్ట్రాల రాజధానుల లిస్ట్ ఇచ్చింది.
Central says AP Capital Amaravati: ఆంధప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి మాత్రమే అనే మరోసారి కుండబద్దలు కొట్టింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్ సాక్షిగా రాజధాని పేరును ప్రకటించింది. ఏపీ రాజధాని అమరావతి అని చెప్పడమే కాదు... అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించినట్టు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని 28 రాష్ట్రాల (28 States) రాజధానుల జాబితాను కూడా విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ కోసం నాలుగున్నర ఏళ్ల క్రితం మూడు రాజధానులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government). విశాఖపట్నం (Visakhapatnam) ను కార్యనిర్వాహక రాజధానిగా చేసింది. అయితే ఈ కేసు సుప్రీం కోర్టు (Supreem Court) లో పెండింగ్‌లో ఉంది. అయినా కూడా... విశాఖకు రాజధానిని మారుస్తున్నట్టు ఇప్పటికే పలుమార్లు ప్రకటించి వాయిదా వేస్తోంది జగన్ సర్కార్ (Jagan government). ఇటీవల విశాఖలో పరిపాలనా భవనాల ఎంపిక కోసం కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ విశాఖలో పర్యటించి కొన్ని భవనాలను గుర్తించింది. రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమవుతోంది. త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది జగన్ సర్కార్. ఇలాంటి సమయంలో... కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ.. సాక్షాత్తు పార్లమెంట్ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.
అసలు ఏం జరిగిందంటే...?
పార్లమెంట్ సమావేశాలు నిన్నటి (డిసెంబర్ 4, సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజే రాజ్యసభ (Rajya sabha) లో కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు ప్రతిపక్ష ఎంపీలు. ఇందులో భాగంగా ఎంపీ జావెద్ అలీఖాన్ (MP Javed Ali Khan)...దేశంలోని 39శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎంపీ జావెద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ (Union Minister Kaushal Kishore) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తమని చెప్పారు కేంద్ర మంత్రి. దేశంలో త్రిపుర, నాగాలాండ్‌కే మాస్టర్ ప్లాన్లు లేవని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతితోపాటు 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని స్పష్టం చేశారు. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమాకు మాత్రమే మాస్టర్ ప్లాన్లు లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి కౌశల్ కిషోర్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇవ్వడంతో... ఏపీ రాజధానిపై మళ్లీ చర్చ మొదలైంది.
పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటన తర్వాత.. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై మళ్లీ చర్చ మొదలైంది. రాజధానికి విశాఖపట్నానికి మార్చేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే... కేంద్ర మంత్రి అమరావతే ఏపీ రాజధాని అని రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇవ్వడం... ఉత్కంఠ రేపుతోంది. అసలు ఏపీ రాజధాని ఏది..? అన్నది దరానిపై మళ్లీ ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మూడు రాజధానులు ప్రకటించినా... అది కేంద్రం లెక్కలోకి తీసుకోలేదన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏపీ రాజధాని అమరావతే అని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ప్రకటన తర్వాత.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) రియక్షన్ ఏంటో చూడాలి.