Avinash Reddy :నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారన్న అవినాష్ రెడ్డి !
అవినాష్ రెడ్డిని నాలుగు గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారని ఆయన మీడియాకు తెలిపారు.
Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో హాజరయ్యారు. ఏడున్నర వరకూ సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్‌ను తొలి సారి నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సీబీఐకి పూర్తిగా సహకరిస్తున్నానని.. కొంత మంది సీబీఐని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ అవసరమైతే పిలుస్తామని చెప్పారని అవినాష్ రెడ్డి తెలిపారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలు చెప్పానన్నారు.
అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసులోకి వెళ్లినప్పటి నుండి ఆయన అనుచరులు బయట ఉత్కంఠగా గడిపారు. అయితే ఏడున్నర సమయంలో ఆయన బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. విచారణ సమయంలో సీబీఐ ఆఫీసుకు అవినాష్ రెడ్డితో పాటు శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు వంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. లాయర్ ను అనుమతించాలని వారు మీడియా ముందు డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చే ముందే.. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా లేఖ రాసి అందులో కొన్ని విజ్ఞప్తులు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
అయితే ఈ విజ్ఞప్తులను సీబీఐ పట్టించుకోలేదు. లాయర్ ను కూడా లోపలికి అనుమతించలేదు. అంతకు ముందు సీబీఐ విచారణకు వెళ్లే ముందు.. లోటస్ పాండ్‌కు వెళ్లారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి తో సమావేశం అయ్యారు. దాదాపుగా అరగంట పాటు చర్చలు జరిపిన తర్వాత బయటకు వచ్చి నేరుగా సీబీఐ ఆఫీసుకు వెళ్లారు. ఏ అంశాలపై చర్చించారన్నది స్పష్టత లేదు. అయితే ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. అవినాష్ రెడ్డికి ఈ నెల 24నే విచారణకు రావాలని 23న సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఐదు రోజుల తర్వాత విచారణకు రాగలనని ఎంపీ బదులిచ్చారు. దీంతో ఈ నెల 25న పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చారు. దీంతో ఆయన సీబీఐ ఎదుట హాజరయ్యారు.
సీబీఐ విచారణ ఏ కోణంలో జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. అయితే వివేకా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం చేయడం.. దారుణ హత్య జరిగినా గుండె పోటు అని సమాచారం అందరికీ ఇవ్వడం గురించి ప్రధానంగా ప్రశ్నించారని చెబుతున్నారు.