YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం - రీ ఇన్వెస్టిగేషన్‌కు సీబీఐ కోర్టు ఆదేశం
CBI court: వివేకా హత్యకేసులో రీ ఇన్వెస్టిగేషన్ కు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేయాలని విచారణ తర్వాత తీర్పు ఇచ్చింది.

CBI court orders re-investigation in Viveka murder case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగించాలని సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఇంకా ముగియలేదని..కాల్ రికార్డుల ఆధారంగా మరింత దర్యాప్తు చేసి సూత్రధారులను పట్టుకోవాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. దీంతో సీబీఐ తదుపరి విచారణ కొనసాగించనుంది.
గతంలో వివేకా హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామునే తెలిసిందని మాజీ సీఎం కల్లాం అజేయరెడ్డి సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ విషయం దుమారం రేగింది. ఎవరికీ తెలియక ముందే జగన్ కు ఎలా తెలిసిందని ప్రశ్నలు వచ్చాయి. అయితే అప్పటికే సీబీఐ దర్యాప్తు ముగిసింది. తదుపరి దర్యాప్తు జరగలేదు. ఇప్పుడే దర్యాప్తు జరగడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతానికి ఎక్కడిదక్కడే ఉంది. సుప్రీంకోర్టు గతంలో దర్యాప్తు పూర్తి చేసేందుకు గడువు పెట్టింది. ఆ మేరకు సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి వివరాలను సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. అదే సమయంలో వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, గంగిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. తదుపరి దర్యాప్తు అవసరమో లేదో...దిగువకోర్టు తేలుస్తుందని..కేసును సీబీఐ కోర్టుకు పంపించారు. విచారణ తరవాత తదుపరి దర్యాప్తు అవసరం అని కోర్టు తేల్చింది.
వివేకా హత్య కేసు దర్యాప్తునకు వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించలేదు. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల మీదనే కేసులు నమోదు చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కర్నూలు పోలీసులు సహకరించకపోవడంతో అరెస్టు చేయలేకపోయారు. ప్రభుత్వంలోని పెద్దలు సీబీఐ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. చివరికి సునీత విచారణను తెలంగాణ హైకోర్టుకు మార్చాలని సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారు. కొత్తగా దర్యాప్తు చేసే విషయంలో సీబీఐకి ఎలాంటి సహకారం కావాలన్నా పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం సహకరిస్తుంది. అందులో సందేహం లేదని అనుకోవచ్చు.
వైఎస్ వివేకా హత్య కేసులో రాజకీయ కోణాలు ఉన్నాయని సీబీఐ చెబుతోంది. అందుకే ఈ కేసును వీలైనంత వేగంగా కొలిక్కి తీసుకు వచ్చి ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ దిశగా త్వరలో సీబీఐ మరోసారి విచారణ జరపడం.. ఈ సారి ఆటంకాలు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేసి .. నిందితుల్ని జైుకు పంపడం ఖాయమని భావిస్తున్నారు. ఈ విషయంలో వచ్చే రెండు, మూడు నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. వైఎస్ సునీత కూడా అదే నమ్మకంతో ఉన్నారు.





















