Case On JC : మీసం మెలేసినా కేసు పెడతారా..? జేసీ ప్రభాకర్ పై పెట్టిన కేసులో నిజమేంటి..?
మీసం మెలేశారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఉద్రిక్తంగా ఉండే నియోజకవర్గాల్లో తాడిపత్రి అగ్రస్థానంలో ఉంటుంది. ఎన్నికల్లాంటివి జరిగితే ఇక చెప్పాల్సిన పని లేదు. తాజా మున్సిపల్ రెండో వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చెలరేగిన వివాదంతో మాజీ ఎమ్మెల్యే... మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 153A, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. దీంతో విపక్ష టీడీపీ నేతలు... జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం మెలేసినందుకు కేసు పెట్టారని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ అంశం కాస్త విచిత్రంగా ఉండటం... టీడీపీ నేతలపై పోలీసులు పెట్టే కేసులు ఎక్కువగా ఉండటంతో... విషయం వైరల్ అయింది.
వైసీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో మీసం మెలేసి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. 153A, 506 సెక్షన్ల కింద నేరాల్ని చూపించారు. ఈ రెండు సెక్షన్లు మీసం మెలేయడం గురించి చెప్పలేదు... కానీ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం.. ఘర్షణలకు ప్రోత్సహించడం, కుట్ర పూరితంగా మాట్లాడటం వంటివి ఉన్నాయి. బహుశా పోలీసులు వీటినే నేరాలుగా కోర్టులో చూపించడానికి అవకాశం ఉంది. అయితే.. వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులో మీసం మెలేయడం.. రెచ్చగొట్టడం వంటి అంశాలు ఉన్నాయి. దీంతో అందుకే పోలీసులు కేసుపెట్టారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేయడం ప్రారంభించారు.
అసలు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదు చేయడానికి కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో. ఆ వీడియోలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం మెలేస్తే.. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సవాల్ చేస్తున్నట్లుగా ఉంది. దాన్ని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా సర్క్యూలేట్ చేశారు. ఇది వైసీపీ నేతలకు కోపం తెప్పించింది. దాంతో వైరు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మున్సిపాల్టీల్లో రెండో వైస్ చైర్మన్‌ని ఎన్నుకునేలా ప్రభుత్వం చట్టాన్ని మార్చింది. దీని ప్రకారం... రెండో మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం కోసం ఎన్నికలు జరిగాయి. తాడిపత్రిలో టీడీపీకి మెజార్టీ ఉండటంతో... వైసీపీ సభ్యలు గైర్హాజర్ అయ్యారు. టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అప్పటికే ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటకు మాట కొనసాగుతూడటంతో మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరూ లేనప్పుడు తన ఇంటికి వచ్చిన విషయాన్ని ప్రస్తావించి... ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ చైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయాలని.. మళ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దామని...ఎమ్మెల్యే సవాల్ చేశారు. దానికి ప్రభాకర్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే... ఎన్నికలకు వెళదామని సవాల్ చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు కొత్తేం కాదు. ఆయన కరోనా సమయంలోనే జైలుకు వెళ్లి వచ్చారు. పలు కేసులు నమోదయ్యాయి. అయినా ఆయన రాజకీయంగా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఈ మీసం మెలేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారో లేదో కానీ... సోషల్ మీడియాలో మాత్రం ఆయనకు బోలెడంత పబ్లిసిటీ తెచ్చి పెడుతోంది.