Atmakur Bypoll : ఆత్మకూరు బరిలో బీజేపీ, పవన్ సపోర్ట్ లేకపోయినా పోటీ!
Atmakur Bypoll : బీజేపీ తరపున జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ కుమార్ ఆత్మకూరు ఉపఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇతర నేతలు ఉన్నారు.
Atmakur Bypoll : ఆత్మకూరు ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయదు, అది తమ విధాన నిర్ణయం అని పవన్ కల్యాణ్ ప్రకటించిన మరుసటి రోజే బీజేపీ అక్కడ నామినేషన్ దాఖలు చేసింది. బీజేపీ తరపున జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ కుమార్ ఆత్మకూరులో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇతర నేతలు ఉన్నారు.
వైసీపీకి ఏమాత్రం తగ్గకుండా
ఇప్పటికే వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా వైసీపీ నేతలంతా ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీ ర్యాలీతో, కార్యకర్తలతో తరలి వచ్చి ఆయన నామినేషన్ వేశారు. ఆ స్థాయిలో కాకపోయినా బీజేపీ కూడా హడావిడి చేసింది. జిల్లా పార్టీ నేతలంతా తరలివచ్చారు. ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆత్మకూరుకి వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భరత్ కుమార్ కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు మాదేనంటూ ధీమా వ్యక్తం చేశారు.
పోటీ తప్పనట్టే..
నిన్న మొన్నటి వరకు ఆత్మకూరులో ఎన్నిక ఏకగ్రీవం అవుతుందనే ఊహాగానాలున్నాయి. వాటికి చెక్ పెడుతూ బీజేపీ నామినేషన్ దాఖలు చేసింది. చిన్నా చితకా పార్టీలు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నా బీజేపీ వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. జూన్ 23న ఆత్మకూరు ఉప ఎన్నిక ఖాయంగా జరుగుతుంది.
గెలుపెవరిది..?
ఇప్పటికిప్పుడు పరిస్థితిని అంచనా వేస్తే వైసీపీకే మెజార్టీ వస్తుంది. అయితే ఆ పార్టీ నేతలు లక్ష మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీకి టీడీపీ, జనసేన లోపాయికారీగా మద్దతు ఇస్తే మాత్రం వైసీపీ అంచనా వేసిన మెజార్టీ అందుకోవడం కష్టమే. ఎందుకంటే మేకపాటి కుటుంబంపై సింపతీ ఉన్నా కూడా ఓటింగ్ ఏకపక్షంగా జరుగుతుందని అంచనా వేయలేం.
బీజేపీ అభ్యర్థి రాజకీయ నేపథ్యం ఇదీ
ఆత్మకూరులో బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ కుమార్ ఏబీవీపీ నుంచి ఎదిగారు. స్టూడెంట్ అప్పటి నుంచి ఆ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు కావలి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలోనే మున్సిపల్ ఛైర్మన్ అలేఖ్య కొన్ని వివాదాల్లో చిక్కుకుని పదవి నుంచి తప్పుకోవడంతో ఛైర్మన్‌గా కూడా కొన్నాళ్లపాటు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు అధిష్టానం ఆదేశం మేరకు మేకపాటి విక్రమ్ రెడ్డిని ఢీకొట్టబోతున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో సంచలనాలు ఊహించలేం కానీ ప్రతిపక్షాలు చెప్పినట్టు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా, లేదా అనేది ఈ ఎన్నికల్లో తెలిసే అవకాశముంది.