Speaker Ayyannapatrudu : స్పీకర్‌గా అయ్యన్న నామినేషన్ దాఖలు - ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే !
AP Assembly : స్పీకర్ పదవికి అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. కూటమి కీలక నేతలంతా ఆయన తరపున నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Ayanna Patrudu As Speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ , మంత్రులు నారా లోకేష్ , పయ్యావుల కేశవ్ , అచ్చెన్నాయుడు , రీ సత్యకుమార్ యాదవ్ , నాదెండ్ల మనోహర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా మరోసారి గెలిచిన అయ్యన్నపాత్రుడు సభలోనే అత్యంత సీనియర్ ఎమ్మెల్యే. మంత్రి పదవి రేసులో ఉన్నప్పటికీ ఆయనకు స్పీకర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
స్పీకర్ పదవికి పోటీ చేసే బలం వైసీపీకి లేకపోవడంతో పదవి ఏకగ్రీవ కానుంది. శనివారం ఎన్నిక విషయాన్ని లాంఛనంగా ప్రకటించి అన్ని పార్టీల పక్ష నేతలు ఆయనను స్పీకర్ ఛైర్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఆ తర్వాత ఆయనకు మద్దతుగా ప్రసంగిస్తారు. ఓటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో.. స్పీకర్ గా అయ్యన్న బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి వైసీపీ పక్ష నేతగా జగన్ వస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. అయ్యన్న పాత్రుడిపై వైెఎస్ జగన్ హయాంలో అనేక కేసులు పెట్టారు. ఈ విషయంలో ఆయన ఇప్పటికీ ఆగ్రహంగా ఉంటారు.
జగన్ పై ఆయన ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాాదాస్పదం అయ్యాయి. అందుకే స్పీకర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. పదకొండు ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఫైట్ చేయలేమని.. ప్రజా పోరాటాలు చేద్దామని ఇటీవల కార్యవర్గ సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్‌తో పాటు రాజకీయాల్లోకి వచ్చి అనేక పదవులు నిర్వహించిన అయ్యన్న పాత్రుడు
అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ పిలుపతో రాజకీయాల్లోకి వచ్చారు. 1983-1989, 1994-1996 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ తరపున నర్సీపట్నం నుంచి గెలిచారు. 1984-1986 లో సాంకేతిక విద్యా మంత్రిగా పని చేశారు. 1994-96 లో రహదారులు, భవనాల శాఖా మంత్రిగా పనిచేశరు. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. 1996 లో 11వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం తరుపున అనకాపల్లి లోఖ్ సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1999లో అటవీశాఖ మంత్రి అయ్యారు. 2004 ఎన్నికల్లోనూ గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికలలో శాసనసభ్యునిగా విజయం సాధించి ఐదేళ్లుమంత్రిగా ఉన్నారు. 2019లో ఓటమి చెందారు. మళ్లీ ఇప్పుడు ఘన విజయం సాధించారు.