Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి - ఇద్దరు శ్రీకాకుళం జవాన్లు మృతి
Andhrapradesh News: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆ గ్రామాల్లో విషాదం నెలకొంది.
Srikakulam Jawans Died In Terror Attack In Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. సోమవారం రాత్రి ఉగ్రవాదులు, ఆర్మీ బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు సైతం గాయపడ్డారు. ఈ కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం వల్లభరాయునిపాలెం గ్రామానికి చెందిన జవాన్ జగదీశ్వరరావు అమరుడయ్యారు. అలాగే, సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రకు చెందిన జవాన్ డొక్కరి రాజేష్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆయా కుటుంబాలకు ఆర్మీ అధికారులు తెలియజేశారు. దీంతో జవాన్ల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి అచ్చెన్న బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశం కోసం అమరులైన ఇద్దరు జవాన్లకు దేశ ప్రజలంతా ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. జవాన్ల మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు.
ఏడాదిన్నరలో పదవీ విరమణ
నందిగాం మండలానికి చెందిన జవాన్ జగదీశ్వరరావు మరో ఏడాదిన్నరలో పదవీ విరమణ చేయాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 2002లో ఆర్మీకి ఎంపికైన ఆయన.. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో హవల్దార్‌గా పని చేస్తున్నారు. జగదీశ్వరరావుకి తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, నారాయణమ్మతో పాటు భార్య సమత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీశ్వరరావు సోదరుడు విఘ్నేశ్వరరావు సైతం ఆర్మీలోనే పని చేస్తున్నారు.
కాగా, జమ్మూకాశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు కలవరపెడుతున్నాయి. దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు భద్రతా బలగాలతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఉగ్ర కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు.