AP Weather Updates: ఎండల్లో మండుతున్న ఏపీకి చల్లని కబురు, త్వరలోనే నైరుతి రుతుపవనాల రాక!
AP Weather Updates: ఈ ఏడాది జూన్ 15వ తేదీ నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. త్వరలోనే ఎండల నుంచి ప్రజలకు విముక్తి కల్గుతుందని వివరిస్తోంది.

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎండలు విపరీతంగా మండుతున్నాయి. నేడు మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వేడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. ఇవే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని.. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.
విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిన్న నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 46 డిగ్రీలు, తిరుపతి జిల్లా ఏర్పేడులో 46 డిగ్రీలు, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా 4 మండల్లాలో తీవ్ర వడగాల్పులు, మిగిలిన చోట్ల మొత్తం 38 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వివరించారు.
త్వరలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు..!
ఈ ఏడాది జూన్ 15వ తేదీ నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతీ ఏడాది మే 20వ తేదీ నాటికి అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ 1నాటికి కేరళను తాకుతాయి. అప్పటి నుంచే దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది. అయితే ఈ ఏడాది నైరుతి మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 22వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవుల అంతటికీ విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు రుతుపవనాల ప్రవేశానికి సూచికగా మూడు రోజులుగా అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతరం రుతుపవనాలు జూన్ 4 నాటికి కేరళను తాకనుండడంతో ఆ ప్రభావం ఏపీపైనా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ద్రోణి ప్రభావంతో రాగల ఐదు రోజుల్లో తేలిక పాటి వర్షాలు
నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన పది రోజుల్లోగా రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తాయి. అనంతరం మరో వారం రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి. అంతా అనుకూలిస్తే జూన్ 10కి బదులు 15వ తేదీకల్లా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్ లోనూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందట. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

