AP Politics : సింగిల్ వర్సెస్ పొత్తులు, ఏపీలో రెండేళ్ల ముందుగానే పొత్తులపై కుస్తీలు
AP Politics : ఏపీలో పొత్తుల రాజకీయం జోరుగా సాగుతోంది. ఒకరు అద్భుతం జరుగుతుందంటే, మరొకరి త్యాగానికి సిద్ధం అంటున్నారు. ఇంకొకరు సింహం సింగిల్ డైలాగ్స్ కొడుతున్నారు.
![AP Politics : సింగిల్ వర్సెస్ పొత్తులు, ఏపీలో రెండేళ్ల ముందుగానే పొత్తులపై కుస్తీలు AP Politics Tdp janasena bjp alliance ysrcp single talks creates political heat AP Politics : సింగిల్ వర్సెస్ పొత్తులు, ఏపీలో రెండేళ్ల ముందుగానే పొత్తులపై కుస్తీలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/08/867b1ec23a428849dd60b0f3c1e723b0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Politics : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. అయినా రెండేళ్ల ముందు నుంచే పొలిటిక్ హీట్ మెదలైంది. పార్టీల పొత్తులపై బీజేపీ, టీడీపీ, జనసేన అధినేతల వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏదైనా అద్బుతం జరగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవసరం అయితే త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. అయితే బీజేపీ దీనికి భిన్నంగా స్పందిస్తుంది. అలాంటి త్యాగాలు అవసరం లేదని సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ మాత్రం ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా, విజయం తమదేనన్న ధీమాతో ఉంది. దీంతో ఏపీలో పొత్తుల రగడ మెదలైంది.
ఏపీలో పొత్తులు రాజకీయం
ఏపీలో ఎండలు దంచికొడుతుంటే, ఇటు రాజకీయాలు కూడా గరం గరంగా మారాయి. ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే రాజకీయ పార్టీలు ఎన్నికలే లక్ష్యంగా పొత్తులు ప్రసక్తి తెస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీ అయితే ఒక అడుగు ముందుకేసి ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందని ప్రచారం చేస్తుంది. అంతే కాదు అవసరం అయితే ఎలాంటి త్యాగాలకు అయినా సిద్ధమని కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అందులో భాగంగా జిల్లాల పర్యటనలో చంద్రబాబు బిజీ అయ్యారు. ఈ రెండేళ్లలో ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసి రాజకీయంగా చైతన్యవంతమయిన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇక జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అధినేత పవన్ కల్యాణ్ కూడా పొత్తులపై వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమన్నారు.
వైసీపీ ధీమా
అలాగే తాము ఎవరి పల్లకీ మోయటానికి సిద్ధంగా లేమని ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే జనసేన పనిచేస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా కౌలు రైతు భరోసా యాత్రలో కూడా పవన్ ఆసక్తికరంగా మాట్లాడారు. ఏదైనా అద్భుతం జరగాలని నవ్వుతూనే వ్యాఖ్యానించారు. ఇక జనసేనతో పొత్తును కంటిన్యూ చేస్తున్న బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు దీటుగా జవాబు ఇచ్చింది. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలతో కలిసేది లేదని, వారి త్యాగాలు రాష్ట్రానికి అవసరం లేదని సొము వీర్రాజు వ్యాఖ్యానించారు. అంతే కాదు జూన్ లో జాతీయ అధ్యక్షుడు నడ్డాతో రాష్ట్రంలో బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు. దీంతో రెండు సంవత్సరాలు ముందుగానే ఏపీలో ప్రతిపక్షాలన్నీ ఎన్నికల పొత్తులు, వ్యూహాలపై దృష్టి సారించినట్లుగా కనపడుతుంది. అయితే అధికార వైసీపీ మాత్రం తమది ప్రజల ప్రభుత్వం కాబట్టి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు దక్కించుకొని క్లీన్ స్వీప్ చేస్తామనే ధీమాలో ఉన్నారు. ఈ పరిణామాలు రాబోయే రెండేళ్ళలో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)