AP New Districts: కొత్త జిల్లాలపై ప్రణాళిక విభాగం క్లారిటీ... లోతైన అధ్యయనం చేశామని ప్రకటన...
పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయం చేశామన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనేదానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు.
సీఎం ఆలోచన మేరకు రెండు జిల్లాలు
విజయవాడలోని ఏపీ ప్రణాళిక విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను, చారిత్రక అంశాలు అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని విజయ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నామన్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధిలో ఉన్న కారణంగా గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయని, గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం ఆలోచించి రెండు జిల్లాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
Also Read: ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు ప్రతిపాదన... అవేంటంటే...!
ఎచ్చెర్ల అందుకే కలిపాం
శ్రీకాకుళం పేరున్న సంస్థలన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయన్న విజయ్ కుమార్... అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపామన్నారు. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాంను ఆ జిల్లాలో కలిపామని తెలిపారు. విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశామన్నారు. పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాశం ఉందన్నారు. భీమిలి గత ప్రాముఖ్యత దృష్ట్యా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశామన్నారు. రంపచోడవరం అభివృద్ధి కోసమే అల్లూరి జిల్లాలో కలిపామని విజయ్ కుమార్ తెలిపారు.
ఏపీలో కొత్తగా 13 జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఉగాది నాటికి ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాథమిక నోటిఫికేషన్‌పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను నెలరోజుల్లోపు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.
జిల్లా పేరు - జిల్లా కేంద్రం
శ్రీకాకుళం - శ్రీకాకుళం
విజయనగరం - విజయనగరం
మన్యం జిల్లా - పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు జిల్లా - పాడేరు
విశాఖపట్నం - విశాఖపట్నం
అనకాపల్లి - అనకాపల్లి
తూర్పుగోదావరి - కాకినాడ
కోనసీమ - అమలాపురం
రాజమహేంద్రవరం - రాజమహేంద్రవరం
నరసాపురం - భీమవరం
పశ్చిమగోదావరి - ఏలూరు
క్రిష్ణా - మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా - విజయవాడ
గుంటూరు - గుంటూరు
బాపట్ల - బాపట్ల
పల్నాడు - నరసరావుపేట
ప్రకాశం - ఒంగోలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు - నెల్లూరు
కర్నూలు - కర్నూలు
నంద్యాల - నంద్యాల
అనంతపురం - అనంతపురం
శ్రీ సత్యసాయి జిల్లా - పుట్టపర్తి
వైఎస్ఆర్ కడప - కడప
అన్నమయ్య జిల్లా - రాయచోటి
చిత్తూరు - చిత్తూరు
శ్రీబాలాజీ జిల్లా - తిరుపతి