AP Welfare Schemes: కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం - అండగా నిలిచిన మహిళలకు శుభవార్త, అకౌంట్లలోకి నగదు!
Andhra Pradesh News: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ మహిళలకు గుడ్ న్యూస్ అందించనుంది. త్వరలోనే వారి ఖాతాల్లోకి నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందించనుంది.
AP Government New Welfare Scheme For Womens: ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ బీజేపీ జనసేన కూటమికి 164 స్థానాలతో ఏపీ ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈసారి కూటమి ప్రభంజనానికి మహిళలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అయితే, ఫలితాలకు ముందు వైసీపీ నేతలు సైతం మహిళలు, వృద్ధులు తమకు అండగా ఉన్నారని కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్.. నవరత్నాల పేరుతో జనంలోకి వెళ్లి ఘన విజయం సాధించారు. ముఖ్యంగా మహిళల కోసం అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, కాపునేస్తం వంటి పథకాలను అమలు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ అదే మాట చెప్తూ ఓట్లు అభ్యర్థించారు. అయితే, ఈసారి కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల వారు మద్దతు పలికారు. అంతే కాకుండా కేవలం పథకాలు అందిస్తే కాదు అభివృద్ధి కూడా ముఖ్యమే అనే రీతిలో ప్రజలు ఈ తీర్పు వెలువరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మహిళలే అండగా నిలిచారు
మొదటి నుంచి మేనిఫెస్టో రూపకల్పనలో కూటమి పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. మహిళలు, వృద్ధులను ఆకర్షించేలా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. మహిళా ఓటర్లను ఆకర్షించేలా 'మహాశక్తి' పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 'స్త్రీనిధి' కింద నెలకు రూ.1500 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకానికే మహిళలు ఎక్కువగా ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. నెలకు కొంత నగదు తమ అకౌంట్లో పడితే నెలవారీ సరుకుల కొనుగోలుకు ఇబ్బంది ఉండదని.. కొంత భారం తగ్గుతుందనే సామాన్య గృహిణులు ఎక్కువగా ఆలోచించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే, 'తల్లికి వందనం' పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000 అందిస్తామని చెప్పారు. 'దీపం' పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం
కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీ 'ఉచిత బస్సు ప్రయాణం'. ఈ పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టిక్కెట్టు లేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకం విజయవంతంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుండడంతో అక్కడి చిరుద్యోగులు, సామాన్య గృహిణులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు అలాంటి పథకాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తామనే హామీ ఇవ్వడంతో యువత, మహిళలు, సామాన్య గృహిణులు కూటమికి జేజేలు పలికినట్లు అర్థమవుతోంది.
త్వరలోనే గుడ్ న్యూస్
ఈ నెల 12న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే హామీల అమలుపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళలకు నెలకు రూ.1500 నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. దాంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పథకాలను కూడా అమలు చేయనున్నారు.