Andhra Pradesh News: భవనాలు, లేఅవుట్ల అనుమతులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం- అన్‌లైన్లో అప్లై చేస్తే చాలు
AP Minister Narayana | ఏపీలో 15 మీటర్ల ఎత్తు వరకు ఉండే భవన నిర్మాణాలకు ప్రత్యేకంగా అనుమతి అక్కర్లేదని, ఆన్ లైన్లో అప్లై చేస్తే సరిపోతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.
AP CM Chandrababu Review on Town Planning | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భవనాలు, లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 మీటర్ల ఎత్తు వరకూ భవనాల నిర్మాణాల ప్లాన్ లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలపై వేసిన కమిటీ రిపోర్ట్ కు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష ముగిపింది.
మంత్రి నారాయాణ మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 మీటర్ల ఎత్తు వరకు భవనాల నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. లైసెన్సెడ్డ్ సర్వేయర్లు సంబంధిత ప్లాన్ ఆన్ లైన్లో పెట్టి నగదు చెల్లిస్తే అనుమతి వచ్చేస్తుంది. పునాది వేసిన తర్వాత ఆన్ లైన్ లో అప్లై చేస్తే సరిపోతుంది. అంతా కరెక్టుగా ఉందో లేదో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వెరిఫై చేస్తోంది. ఏమైనా అక్రమాలు జరిగితే సర్వేయర్ల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఈ విధానంతో 95 శాతం మంది మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు.
డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం
భవనాల అనుమతులకు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమలు చేస్తాం. టీడీఆర్ బాండ్లు అవసరం లేని వారికి ఆ విలువకు సంబంధించి అక్కడే నిర్మాణం చేసుకునేలా అనుమతి మంజూరు. 500 చదరపు అడుగులు దాటిన నివాస భవనాలకూ సెల్లార్ పార్కింగ్ కు అనుమతి. లే ఆవుట్లలో ఇక నుంచి 9 మీటర్ల రోడ్డును మాత్రమే వదిలేలా వెసులుబాటు కల్పిస్తాం. టీడీఆర్ బాండ్ల అక్రమాలల్లో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తాం. కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఇదే విధానం అమల్లో ఉందని’ మంత్రి నారాయణ వివరించారు.
త్వరలోనే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం
కేంద్రం గతంలోనే రాజధాని అమరావతి అని పార్లమెంటులో స్పష్టం గా చెప్పింది. కేంద్రం అధికారిక గెజిట్ ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను నార్మన్ పోస్టర్ సంస్థ రూపోందించింది. గత వైసీపీ ప్రభుత్వం నార్మన్ పోస్టర్స్ సంస్థ టెండర్ ను, వారి డిజైన్లను రద్దు చేసింది. అందుకే మళ్లీ భవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలిచాం, ఆ టెండర్లు కూడా నార్మన్ పోస్టర్స్ సంస్థకే వచ్చాయి. సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదం తెలిపాం. త్వరలోనే వీటి తుది డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తాం. - మంత్రి నారాయణ
గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నోటీసు లేకుండా టెండర్లు రద్దు చేయటంతో నార్మన్ పోస్టర్స్ ఆర్బిట్రేషన్ వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అందుకే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంలో వారికి 9 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. దాంతో ఇప్పుడు మళ్లీ రీటెండర్ పిలవాల్సి వచ్చిందని, త్వరలోనే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు మొదలవుతాయని తెలిపారు. ప్రపంచ బ్యాంకు (World Bank) రుణానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దశలవారీగా రుణం ఇచ్చేందుకు ఇప్పటికే ముందుకు వచ్చిందని తెలిపారు.
Also Read: PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!