AP Highcourt School Building : స్కూల్ స్థలాల్లో ఉన్న ఆర్బీకేలు, సచివాలయాలన్నీ విద్యాశాఖకే - ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !
ప్రభుత్వ స్కూల్ స్థలాల్లో కట్టిన ఆర్బీకేలు, సచివాలయ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
AP Highcourt School Building : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్‌లో కట్టిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర పంచాయతీ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో హైకోర్టు ఎదుట చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్కూల్స్‌లో నిర్మాణాలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఆ భవనాల విషయంలో పేరెంట్స్ కమిటీలతో మాట్లాడాలని పిటిషనర్ తరపు లాయర్ లక్ష్మినారాయణ సూచించారు. లాయర్ సూచనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.
అనేక చోట్ల స్కూల్ స్థలాల్లో ఆర్బీకేలు, సచివాలయాలు నిర్మించిన ప్రభుత్వం
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, వెల్ నెస్ సెంటర్లు..ఇతర భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో విశాలమైన స్థలాలు ఉండటంతో వాటిలో నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్న ప్రాంగణాల్లో ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. దీంతో హైకోర్టు గతంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. ఆయినా నిర్మాణాలు కొనసాగాయి. ఇది కోర్టు ధిక్కరణగా హైకోర్టు భావించింది. ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాల ఆవరణల్లో గ్రామ సచివాలయాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి కట్టడాలు ఉంటే వాటిని ఖాళీ చేయించి విద్యాశాఖకు అప్పగిస్తారు.
వద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ వరుసగా నిర్మాణాలు చేసిన అధికారులు
నిజానికి ఇలా ఆ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత పాఠశాల ఆవరణలో ఉన్న సచివాలయాలు, ఆర్బీకేలను అక్కడి నుంచి తొలగించి కొత్త భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా మరో చోట ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఉత్తర్వులు పాటించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వాటి ఆవరణలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు అవేమీ పట్టించుకోవడంలేదు. పాఠశాల ఆవరణలో, భవనాలలో ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తే వివిధ పనులపై అక్కడికి వచ్చే ప్రజలు, రాజకీయ నాయకుల వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందన్న ఆందోళన ఉంది.
చట్ట విరుద్ధం కావడంతో వాటిని విద్యాశాఖకు అప్పగించాలని ఆదేశాలు
ఈ విషయంలో పలుమార్లు ఉన్నతాధికారులు హైకోర్టు ఎదుట హాజరయ్యారు. పదే పదే హైకోర్టు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ఉల్లంఘిస్తున్ందున వారిని హైకోర్టు మరోసారి పిలిపించింది. ఈ సారి సీఎస్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఆ భవనాలన్నింటినీ విద్యాశాఖకు అప్పగించాలని ఆదేశించడంతో.. వాటిని అదనపు తరగతి గదులుగా వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై జనవరి 20వ తేదీన జరిపే విచారణ తర్వాత కీలక ఉత్తర్వులు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
రుషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు - ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులేనా ?