Rushikonda Hihgcourt : రుషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు - ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులేనా ?
రుషికొండ అక్రమ తవ్వకాల విషయంలో పూర్తిగా కేంద్ర అధికారులతోనే సర్వే చేయించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. జనవరి 31లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
Rushikonda Hihgcourt : విశాఖలోని రుషికొండ అక్రమ తవ్వకాల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర సర్వేకు నియమించే బృందంలో ఉన్న ముగ్గురు ఏపీ అధికారుల్ని తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర శాఖళ అధికారులతో.. ఐదుగురు సభ్యుల కమిటీని నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ తవ్వకాలపై పూర్తి సమాచారం బయటకు వచ్చేలా సమగ్ర సర్వే చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కమిటీ జనవరి 31వ తేదీలోపు హైకోర్టుకు నివేదిక అందించాలని ఆదేశించింది. కేంద్ర అటవీ , పర్యావరణ శాఖ కమిటీని నియమించిన తర్వాత ఆ వివరాలు హైకోర్టుకు పంపాలని ఆదేశించింది.
ఇదే అంశంపై బుధవారం కూడా హైకోర్టు విచారణ జరిపింది. విశాఖ రుషికొండ అక్రమ తవ్వకాల విషయంలో రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లుగా ఉందని ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీ నియమించాలని హైకోర్టు ఆదేశిస్తే.. కేంద్రం రాష్ట్ర అధికారులతో కమిటీ నియమించింది. దీనిపై పిటిషనర్ తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమ తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు వేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించడం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే కేంద్రం ఏపీ ప్రభుత్వ అధికారుల నియామకాన్ని సమర్థిస్తూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్ని చూసిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లు కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గురువారం విచారణలో తామే కమిటీని నియమించాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే ఇప్పుడు హైకోర్టు మళ్లీ రాష్ట్ర అధికారులు లేకుండా కేంద్ర అధికారులతోనే కమిటీని నియమించాలని ఆదేశించింది.
విశాఖలో సముద్రం ఒడ్డున ఉండే రుషికొండలో గతంలో టూరిజం రిసార్ట్స్ ఉండేవి. వాటిని కూల్చి వేసి.. కొండను మొత్తం తవ్వేశారు. అక్కడ టూరిజంకు సంబంధించిన పెద్ద హోటల్ కడుతున్నామని చెప్పుకొచ్చారు. అయితే పర్యావరణ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించి రుషికొండలో తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం అనుమతి ఉన్న వరకే తవ్వుతున్నామని వాదించింది. కానీ 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు మ్యాపులు సమర్పించారు. విచారణలో అనుమతి ఇచ్చిన దాని కన్నా మూడు ఎకరాలు అదనంగా తవ్వామని అంగీకరించింది. కానీ అంతకు మించి తవ్వారని పిటిషనర్లు వాదించడంతో సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సజావుగా సర్వే నిర్వహిస్తే ప్రభుత్వ బండారం బయట పడుతుందని విపక్షాలు అంటున్నాయి.
నిబంధనలకు ఉల్లంఘించినట్లుగా తేలితే.. అధికారులను జైలుకు పంపిస్తామని హైకోర్టు గతంలోనే హెచ్చరించింది. ఇప్పటికి ప్రభుత్వమే మూడు ఎకరాలు తవ్వేసినట్లుగా చెప్పడంతో నిబంధనలు ఉల్లంఘించినట్లయింది. అయితే అదనంగాఇరవై ఎకరాలు తవ్వినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులే సర్వే చేసి జనవరి 31వ తేదీలోపు నివేదిక ఇవ్వనున్నారు.