Kanagaraj : జస్టిస్ కనగరాజ్‌కు మరోసారి నిరాశ ... ప్రభుత్వ నియామకం చెల్లదన్న హైకోర్టు !
జస్టిస్ కనగరాజ్‌కు రెండో సారి పదవి పోయింది. పోలీస్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా ప్రభుత్వ నియామకం చెల్లదని హైకోర్టు సస్పెండ్ చేసింది. గతంలో ఎస్‌ఈసీ పదవిని కూడా న్యాయస్థానాలు తొలగించాయి.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఆయన నియామకం జరిగిందని హైకోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ 65 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని అయితే కనగరాజ్‌కు ఇప్పటికే 78 ఏళ్లు ఉన్నాయని పారా కిషోర్ అనే లాయర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఏపీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ నిబంధన 4(ఏ)కి విరుద్ధంగా జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వయసురీత్యా అర్హత లేని వ్యక్తిని ఆ పదవిలో నియమించారని పారా కిషోర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం జస్టిస్ కనగరాజ్‌ను నియమించిందని వాదించారు. Also Read : కార్పొరేషన్ రుణాల లెక్క చెప్పండి .. ఏపీ ప్రభుత్వానికి కాగ్ లేఖ !
అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గతంలో జస్టిస్ కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా సర్కారు నియమించిన విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ నియామకాన్ని హైకోర్టు రద్దుచేసిందని.. అందుకు బదులుగా పోలీసు కంప్లైంట్స్ అథార్టీ ఛైర్మన్‌గా పదవి ఇచ్చారన్నారు. జస్టిస్ కనగరాజ్‌కు ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ నియామకానికి వీలుగా నిబంధనలను సవరించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాది పారా కిషోర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కనగరాజ్ నియాకమాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. Also Read : 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ! భక్తులకు సేవ చేస్తారా ? భక్తుల సొమ్ముతో సేవలు పొందుతారా ?
పోలీసులపై ఫిర్యాదులు చేసే వ్యవస్థ ఉండాలని అన్ని రాష్ట్రాలు పోలీస్ కంప్లైంట్ అధారిటీని ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేస్ పోలీసు కంప్లయింట్ అథారిటీ రూల్స్ - 2002లోని సెక్షన్ 4(ఏ) ప్రకారం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని పిసీఎ చైర్మన్ గా నియమించాలి. 65 ఏళ్లు వచ్చేవరకు లేదా మూడేళ్లు అది ముందయితే అప్పటి వరకు ఆ పదవిలో కొనసాగడానికి అర్హులు. 65 ఏళ్ల వయస్సు దాటినవారు ఆ పదవిలో కొనసాగడానికి వీలు లేదు. కానీ ప్రత్యేకంగా వయసు నిబంధనలకు ప్రత్యేక సడలింపులు ఇవ్వడంతో న్యాయవివాదాల్లో చిక్కుకుంది. Also Read : ఏపీ పరిషత్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
గతంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాత్రికి రాత్రి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం తర్వాత ఎస్‌ఈసీగా జస్టిస్ కనగరాజ్‌నే నియమించారు. ఆయన విధుల్లో కూడా చేరారు. అయితే ఆ నిర్ణయం న్యాయస్థానాల్లో నిలబడలేదు. దాంతో ఎస్ఈసీగా మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులయ్యారు. అప్పుడు పదవి పోవడంతో ఏడాది తర్వాత తిరిగి కనగరాజ్ కు పిసీఏ చైర్మన్ పదవిని ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ పదవిని కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. Also Read : సీఎం జగన్ లేఖపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ... బహ్రెయిన్ లో తెలుగు వారి సమస్య పరిష్కారం...