Bahrain Telugu Workers Issue: సీఎం జగన్ లేఖపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ... బహ్రెయిన్ లో తెలుగు వారి సమస్య పరిష్కారం...
సీఎం జగన్ లేఖపై స్పందించిన కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. బహ్రెయిన్ లో ఓ సంస్థ చేతిలో ఇబ్బంది పడుతున్న తెలుగు వారి సమస్యను పరిష్కరించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. దీంతో బహ్రెయిన్ లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారమైంది. బహ్రెయిన్‌లో ఎన్‌హెచ్‌ఎస్ అనే సంస్థలో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ సమస్యపై స్పందించిన సీఎం జగన్.. సమస్యను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 13న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. దీనిపై విదేశాంగ శాఖ బహ్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయానికి ఆదేశాలు జారీచేసింది.
అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా చెందిన వారు
ఈ ఆదేశాలతో బహ్రెయిన్ లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం సిబ్బంది ఎన్‌హెచ్‌ఎస్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అక్కడి సిబ్బంది తిరిగి విధుల్లో హాజరవడానికి ఆ సంస్థ అంగీకరించినట్లు ఏపీఎన్‌ఆర్‌టీ ఛైర్మన్ వెంకట్ ఎస్ మేడపాటి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీకి సంబంధించిన ఎన్‌హెచ్‌ఎస్ అనే సంస్థ సబ్ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తోంది. కార్మికులకు సరైన వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ సంస్థలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికులు ఉన్నట్లు మేడపాటి తెలిపారు. కొంతమంది కార్మికుల కారణంగా సమస్య తీవ్రంగా ఉందని సీఎం జగన్ విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీంతో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు మేడపాటి ప్రకటించారు.
Also Read: TTD Board : 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ! భక్తులకు సేవ చేస్తారా ? భక్తుల సొమ్ముతో సేవలు పొందుతారా ?
అంతకు ముందు
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ కు సీఎం జగన్ లేఖ రాశారు. బ్రహెయిన్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో వందలాది మంది భారతీయులు ఇబ్బంది పడుతున్నారని లేఖలో తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలో ఏపీకి చెందినవారు కూడా ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. బహ్రెయిన్ లో ఇబ్బందులు పడుతున్న వారిని తిరిగి ఏపీకి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. బహ్రెయిన్ లో ఉన్నవారిని రాష్ట్రానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం పూర్తిగా సహకరిస్తుందని వెల్లడించారు. ఈ విషయమై అన్ని వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.
Also Read: AP High Court: ఏపీ పరిషత్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..