Pinnelli Bail Petitions : పిన్నెల్లికి హైకోర్టులో షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత - ఇక అరెస్టే ?
Palnadu : పిన్నెల్లి బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. ఏ క్షణమైనా ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ పై ఉన్నారు.
AP High Court dismissed Pinnelli ramakrishna Reddy bail pleas : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. పోలింగ్ సమయంలో ఓ ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా పోలింగ్ అనంతర హింసలో పలువురిపై హత్యాయత్నానికి పాల్పడినట్లుగా కేసులు నమోదయ్యాయి.
మాచర్ల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను పగులగొట్టారని ఆరోపణలు వచ్చాయి. పాల్వాయి గేట్ అనే గ్రామం పోలింగ్ బూత్ లో ఆయన నేరుగా వెళ్లీ ఈవీఎంను పగులగొట్టారు. కానీ అక్కడి సిబ్బంది గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారని చెప్పడంతో అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పోలింగ్ అనంతరం కారంపూడితో పాటు మాచర్ల టౌన్ లో కూడా దాడులు జరిగాయి. పిన్నెల్లి సొంత గ్రామంలో ఓ టీడీపీ ఏజెంట్ పై హత్యాయత్నం జరిగింది. పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పగులగొట్టినప్పుడు టీడీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో ఆయనపైనా హత్యాయత్నం చేశారు. ఇలా మొత్తం మూడు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
ఆయనను అరెస్టు చేస్తారనుకున్న సమయంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. ప్రత్యేక బృందాలు ఆయనను పట్టుకునేందుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఛేజింగ్ కూడా చేసినా దొరకలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కౌంటింగ్ కు వెళ్లాల్సి ఉందని చెప్పి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ముందస్తు బెయిల్ సందర్భంగా నర్సరావుపేటలోనే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అప్పట్నుంచి ఆయన నర్సరావుపేటలోనే ఉంటారు. ఆయన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు.. ఈ కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో న్యాయమూర్తి పరిధిని అతిక్రమించారన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఆయనను కౌంటింగ్ కు వెళ్లకుండా బ్యాన్ చేసి.. పిటిషన్లను పరిష్కరించాలని హైకోర్టుకు సూచించారు.
ఆ తర్వాత పలుమార్లు పన్నెల్లి పిటిషన్లపై విచారణ జరిగింది. అయితే సమయం లేని కారణంగా వాయిదాలు పడుతూ వచ్చాయి. ఐదు రోజుల కిందట.. విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేశారు. బుధవారం రోజున తర్పు వెలువరించారు. అన్ని పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఇప్పుడు అరెస్టు చేయడానికి మార్గం సుగమం అయినట్లయింది. ప్రస్తుతం ఆయన నర్సరావుపేటలోనే ఉంటున్నారు. తీర్పు తర్వాత ఆయన పోలీసులకు లొంగిపోతారా లేదా అన్నది కాసేపట్లో తేలనుంది. హింసకు కారణం అయిన ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కూడా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
మాచర్లలో పిన్నెల్లి ఓ అరాచక సామ్రాజ్యాన్ని నెలకొల్పారని టీడీపీ ఆరోపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలెవరూ పోటీ చేయడానికి ముందుకు రాలేకపోయారు. మాచర్ల టౌన్ మొత్తం ఏకగ్రీవం అయింది. అలాంటి భయానక పరిస్థితులు కల్పించినా గత ఎన్నికల్లో ముఫ్పై వేలకుపైగా ఓట్ల తేడాతో పిన్నెల్లి ఓడిపోయారు.