Teacher Transfers: ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
Andhra Pradesh Teachers Promotion | ఏపీలో త్వరలోనే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అందుకుగారూ రోడ్ మ్యాప్ విడుదల చేసింది.
Teachers Promotion in Andhra Pradesh | అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీచర్ల ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్ల బదిలీల, ప్రమోషన్లు పారదర్శకంగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలుమార్లు స్పష్టం చేశారు. గతం వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన బదిలీల ఉత్తర్వులను ఇదివరకే రద్దు చేయడం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీచర్లకు ఏపీ ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ విద్యాశాఖ విడుదల చేసింది.
టీచర్ల బదిలీ, ప్రమోషన్లకు షెడ్యూల్ ఇదే
డిసెంబర్ 25వ తేదీ, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా సిద్ధం చేయనున్నారు. అనంతరం ఏప్రిల్ 10- 15 వరకు హెడ్ మాస్టర్లు, ఏప్రిల్ 21- 25 వరకు సీనియర్ అసిస్టెంట్లు బదిలీ పూర్తి కానుంది. ఈ క్రమంలో మే 1 నుంచి 10వ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 16- 20 వరకు హెడ్ మాస్టర్లు, మే 26- 30 వరకు సీనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్లు పూర్తి చేయడానికి విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
ఎన్నికలకు ముందు హడావుడిగా టీచర్ల బదిలీలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావిడిగా ఉపాధ్యాయుల బదిలీ చేయడం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఇబ్బందులకు గురిచేసింది. టీచర్ల బదిలీలకు సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తీసుకుని కూడా బదిలీలు చేయడం లేదని ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వానికి ఇది మరింత బలాన్ని ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది టీచర్లను బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ ఈ బదిలీలకు సంబంధించిన సిఫార్సులు, పైరవీలు చేసి భారీ నగదు చేతులు మారిందని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఉపాధ్యాయుల బదిలీ, ప్రమోషన్లు పారదర్శకంగా జరగాలని నారా లోకేష్ అన్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇటీవల టెట్ పరీక్ష నిర్వహించింది. అనంతరం కీ విడుదల చేసి, తరువాత ఫలితాలు సైతం ప్రకటించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు.