Andhra Free bus : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ - జిల్లాల వరకు కాదు రాష్ట్రమంతటా ఫ్రీ !
AP government: ఉచిత బస్సు పథకాన్ని రాష్ట్రమంతటా వర్తింప చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రులతో పాటు ఆర్టీసీ ఎండీ కూడా ఈ దిశగా సంకేతాలిస్తున్నారు.

Andhra Free bus cross the state : ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చే సమయం దగ్గర పడింది. ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆగస్టు పదిహేనును సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ పథకం విస్తృతిపై వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి.
ఉమ్మడి జిల్లాల పరిధిలో ఫ్రీ బస్ అని హామీ ఇచ్చిన టీడీపీ
సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని ఉమ్మడి జిల్లాల పరిధిలో అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అయితే ఈ అంశానికి పెద్దగా ప్రచారం లభించలేదు. తెలంగాణలో పథకం జిల్లాలకే పరిమితం కాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం యూనిట్ గా అమలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకూ ఉచితంగా వెళ్లవచ్చు. ఈ పథకం విజయవంతమయిందని మహిళలకు పెద్ద ఎత్తున మేలు చేస్తోందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అమలు.. ఏపీలోనూ అలాగే ఉంటుందన్న అభిప్రాయం
అందుకే ఏపీలోనూ మహిళలు రాష్ట్రమంతటా ఉచిత బస్సు ఉంటుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాల పరిధిలోకే పెడితే.. అసంతృప్తి వ్యక్తమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మహిళా ప్రయాణికుల ... ప్రయాణ వివరాలను విశ్లేషించిన అధికారులు.. 80 శాతానికిపైగా మహిళా ప్రయాణికులు జిల్లాల పరిధిలోనే ఉన్నారని తేల్చారు. మరి ఆ ఒక్క ఇరవై శాతం మందికి మాత్రం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని రాష్ట్రం మొత్తం వర్తింప చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ పెరుగుతుంది. ఉపాధి కోసం ప్రయాణించే మహిళలకు డబ్బులు మిగులుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సింగపూర్ నుంచి చంద్రబాబు వచ్చాక కీలక నిర్ణయాలు
ఉచిత బస్సు పథకం అమలు చేస్తే వెంటనే ప్రయాణికులు పెరుగుతారు. మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. కొద్దిరోజుల పాటు రద్దీ ఎక్కువగా ఉంటుంది . అందుకే ప్రభుత్వం దాదాపుగా వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేసింది. రిపేరుకు వచ్చిన బస్సుల్ని బాగు చేయించింది. వీలైనంతగా ఎలక్ట్రిక్ బస్సుల్ని వాడేందుకు రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. పథకం అమలు పరిధిపై .. మంత్రులు అచ్చెన్నాయుడు, రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా అదే చెబుతున్నారు. చంద్రబాబు సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.





















