Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి త్వరలో ఫ్రీగా వాహనాలు, తొలి ప్రాధాన్యం ఎవరికంటే?
PWD Vehicle Scheme: రాష్ట్రంలో దివ్యాంగులకు త్వరలోనే త్రీవీలర్స్ వెహికల్స్ అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన నివేదికను అధికారులు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించారు.
AP Government Free Vehicles To PWD Persons: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. వారికి పూర్తి ఉచితంగా త్రీ వీలర్ వెహికల్స్ (రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు) అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. సంబంధిత అధికారులు సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు నివేదిక ఇచ్చారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే వారికి వాహనాలు అందించేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నియోజకవర్గానికి 10 మంది చొప్పున మొత్తం 1,750 మంది దివ్యాంగులకు త్రీ వీలర్స్ అందించనున్నారు. ఒక్కో వాహనం ధర రూ.లక్ష వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తుండగా.. మొత్తం వాహనాల పంపిణీకి రూ.17.50 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే టెండర్ల ప్రక్రియ నిర్వహించి 4 నెలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వెహికల్స్ పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఎంపికలో వారికే తొలి ప్రాధాన్యం
వాహనాల పంపిణీకి సంబంధించి దివ్యాంగుల అర్హతలను ప్రభుత్వం నిర్థారించింది. డిగ్రీ, ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు, కనీసం ఏడాదికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి ఎంపికలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రూ.3 లక్షల లోపు ఆదాయ పరిమితి ఉండాలి. 18 - 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి అందిస్తారు. 70 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు అర్హులు. ప్రతి ఏటా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. త్రిచక్ర వాహనాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో భారీ డిమాండ్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు వీలైనంత త్వరగా వారికి వాహనాలు అందించేలా అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 1,750 మందికి త్రీ వీలర్స్ అందించడం సహా ప్రతి ఏటా ఇదే స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని సర్కారు భావిస్తోంది.