(Source: Poll of Polls)
Pulivarthi Nani: చెవిరెడ్డి రూ.5వేల కోట్లు దోచి, మరో జిల్లాకు మకాం మార్చాడు!: పులివర్తి నాని ఫైర్
AP Elcetions 2024: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డబ్బు, భూమి అత్యంత ప్రమాదకర వ్యసనాలు అని టీడీపీ నేత పులివర్తి నాని ఆరోపించారు.
చంద్రగిరి: గంజాయి, డ్రగ్స్ ఇతర వ్యసనాలకంటే అత్యంత ప్రమాదకరమైన వ్యసనాలు డబ్బు, భూమి అని.. అలాంటి డబ్బు, భూమి అంటే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యసనమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. పైడిపల్లిలో సోమవారం పులివర్తి నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన వ్యసనం డబ్బు అని అలాంటి వ్యసనంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలుకు మకాం మార్చారని ఆరోపించారు. ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎలాంటి వ్యాపారాలు, వ్యసనాలు లేవని, నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నాని మీడియాతో చెప్పడం, చంద్రబాబు నాయుడు కుప్పంకు వెళ్లారని విమర్శించడం హాస్యాస్పదం అన్నారు.
ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం
1989లో వెనుకబడిన కుప్పం అభివృద్ధి కోసం ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడి వెళ్లి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. చంద్రగిరి ప్రకృతి సంపదైన ఎర్రచందనం, ఇసుక, మట్టి తో పాటు మఠం, ప్రభుత్వ భూములు కబ్జాలతో రూ. 5వేల కోట్లు దోచేశారని అన్నారు. ఇక్కడ దోచుకోవడానికి ఏం లేకపోవడంతో ఒంగోలుకు మకాం మార్చారని విమర్శించారు. 2019 ఎన్నికల అఫిడవిట్ లో చూపినా ఆస్తులకు ఇప్పటి ఆస్తులకు పొంతన ఉందా? అని ప్రశ్నించారు. చెవిరెడ్డి మున్రెడ్డి రోసమ్మ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ , మైక్రోప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాంప్ మాన్ పవర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, సీఎంఆర్ అగ్రిక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, సీఎంఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు నీ కుమారులు, నీ కుటుంబ సభ్యులవి కావా అని ప్రశ్నించారు.
వందల ఎకరాల భూములు చెవిరెడ్డికి ఎలా వచ్చాయి
నాయుడుపేట, గూడూరు, సత్యవేడు, చంద్రగిరి, రేణిగుంట విమానాశ్రయం, మంగళంలో వందల ఎకరాలు భూములు, తాడేపల్లి, తిరుపతి, తుమ్మలగుంట, హైదరాబాద్ లో విల్లాస్స్, పెద్ద భారీ భవనాలు ఎలా వచ్చాయని నిలదీశారు. తుడా నిధులు దుర్వినియోగం పై ఆర్టిఐ యాక్ట్ కట్టినా సమాచారం ఇవ్వకపోవడంతోనే మీ అవినీతి బాగోతం అర్థమైందన్నారు. తుడా లో జరిగిన భారీ కుంభకోణం పై ప్రత్యేక టీం లో విచారణ చేపడుతామన్నారు. ఆయన కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని మీడియా ఎదుట ఉంచి సమాచారం చెప్పాలని డిమాండ్ చేశారు. సచివాల సిబ్బంది ద్వారా ఫించన్లు పంపిణీ చేయకుండా తెలుగుదేశం పార్టీ పై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే కాణిపాకంలో అవినీతి పై సత్యప్రమాణానికి సిద్ధమా అని పులివర్తి నాని సవాల్ విసిరారు.