Andhra News : రిటైరైనా ఉద్యోగంలోనే ఉన్న వారందరికీ షాక్ - తీసేస్తూ ఉత్తర్వులు జారీ
AP CS Orders : గత ప్రభుత్వంలో రిటైరైనా ఇంకా కొనసాగేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్న వారికి ప్రస్తుత ప్రభుత్వం షాకిచ్చింది. వారందరి వద్ద రాజీనామాలు తీసుకోవాలని ఆదేశించింది.
AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైరైన ఉద్యోగుల్ని ఇంటికి పంపాలని నిర్ణయించుకుంది. రిటైరైన ఉద్యోగుల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పంపేదేముందని అనిపించవచ్చు కానీ గత ప్రభుత్వంలో రాజకీయ పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో విభాగంలో ఉద్యోగిగా చేరిపోయారు. వారంతా కొన్ని వేల మంది ఉంటరని అంచనా. డిపార్టుమెంట్ల వారీగా వారి సేవలు అవసరమో కాదో పట్టించుకోకుండా నియామకాలు జరిపారు. కొత్త ప్రభుత్వం ఇలాంటి అవకతవకలపై దృష్టి పెట్టింది. వెంటనే రిటైరైన ఉద్యోగులందర్నీ విధుల్లోంచి తప్పించాలని .. వారందరి వద్ద రాజీనామాలు తీసకుని నిబంధనల ప్రకారం ఆమోదించాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ ముఖ్యనేతలకు చెందిన సన్నిహితులు రిటైరైనా.. ఏదో ఓ పోస్టింగ్ తెచ్చుకుని ప్రభుత్వంలోనే ఉన్నారు. వారంతా ఇప్పుడు కీలక విషయాల్ని బయటకు లీక్ చేస్తున్నారన్న అభిప్రాయంతో వారిని విధులకు దూరంగా పెడుతున్నారు. ఇప్పుడు అందర్నీ తొలగించాలని నిర్ణయించారు.ఒక వేళ ఎవరి సేవలు అయినా అవసరం అయితే ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్ద నుంచి కొత్తగా ఆదేశాలు తెచ్చుకోవాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
గత ప్రభుత్వంలో అనేక కీలక శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగుల హవానే నడిచించింది. నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ సమయం పూర్తయిన తర్వాత కూడా ఆదేశాలు తెచ్చుకుని పోస్టుల్లో కొనసాగుతూ విచ్చలవిడిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో కొన్ని శాఖల్లో అవసరం లేకపోయినా నియామకలు జరిపారు.
ఇప్పటికే వివిధ శాఖల్లో రాజకీయ అవసరాల కోసం నియమించుకున్న వారిని గుర్తించి వారి వద్ద రాజీనామా లేఖలు తీసుకుంటున్నారు. స్కిల్ కార్పొరేషన్, డిజిటల్ కార్పొరేషన్ పేరతో వందల మంది ఉద్యోగుల్ని నియమించుకుని వారితో చిన్న పని కూడా చేయించుకండా పెద్ద ఎత్తున జీతాలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వారంతా వైసీపీ సోషల్ మీడియా కోసం పని చేశారని ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. రిటైరైన ఉద్యోగుల్లోనూ ఇలాంటి వారు ఉంటే .. ప్రభుత్వ వర్గాలు విచారణ జరపనున్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని విభాగాల్లోని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన వారే పెత్తనం చేశారన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అలాంటి వారందర్నీ తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.