బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ - ఏపీ కాంగ్రెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ విజయం ఊహించిందేనని ఆ పార్టి నాయకులు సంబరాలు చేసుకున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ విజయం ఊహించిందేనని ఆ పార్టి నాయకులు సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రరత్న భవన్ లో వేడుకలు..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంపై ఆ పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కర్ణాకలో కాంగ్రెస్ విజయంతో టపాసులు కాల్చిన నేతలు స్వీట్లు పంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అద్భుతమైన విజయం అందించారని, ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచీ మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ఎంతోమంది పెద్దలు టీం వర్కు చేశారని అన్నారు. అందరూ సమిష్టి ప్రణాళికతో ఈ విజయం వరించిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభావం సైతం..
ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు నేతలు కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, స్టార్ క్యాంపెయిన్ లో రఘువీరారెడ్డి మా అందరికీ గైడెన్స్ ఇచ్చారని గిడుగు రుద్రరాజు అన్నారు. అరవై నియోజకవర్గాలలో తెలుగు వారి ప్రభావం ఉందని, అక్కడ కాంగ్రెస్ ను ప్రజలు నమ్మి గెలిపించారని తెలిపారు. గృహజ్యోతు, గృహ లక్ష్మి, అన్నదాత, యువ నిధి, మహిళా శక్తి పథకాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని, కాంగ్రెస్ హామీలను అమలు చేస్తుందనే నమ్మకం తోనే ప్రజలు ఓట్లు వేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల్లో విశ్వసనీయత సంపాదించాం... చేసే పనులే కాంగ్రెస్ చెబుతుందని నమ్మారు కాబట్టే ఫలితాలు వెలువలా వచ్చాయని తెలిపారు.
కర్ణాటకలో ఐదు పథకాలు అమలు అవుతాయి..
కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన ఐదు పథకాలను అమలు చేస్తారని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ప్రజల్లో, కాంగ్రెస్ లో మంచి జోష్ వచ్చిందని తెలిపారు. అందరినీ సమన్వయం చేస్తూ పార్టీ పెద్దలు మమ్మల్ని నడిపించారని, గతం కంటే మా పార్టీకి ఎనిమిది శాతం ఓట్లు అధికంగా వచ్చాయని అన్నారు. మధ్య తరగతి ప్రజల పై పడిన భారాలు ఈ ఎన్నికలలో ఓట్లు ప్రభావం కనిపించిందని, ప్రధాని మోడీ స్వయంగా రోడ్ షోలు చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. భవిష్యత్తులో జరిగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలలో కాంగ్రెస్ కు మంచి ఆదరణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ విజయం ఖాయమని, గుజరాత్ కోర్టులో తీర్పు ద్వారా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని, ఇటువంటి వాటిని ప్రజలు నిశితంగా గమనించారన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని, సదరన్ ఇండియాలో బీజేపీకి చోటు లేదన్నారు. అన్ని చోట్లా కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కడతారని, ఈ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందన్నారు.
బీజేపీ అంటే బాబు, జగన్, పవన్...
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీపై గిడుగు రుద్ర రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపి అంటే బాబు, జగన్, పవన్ అంటున్నారని, పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని అన్నారు. ప్రజలు కూడా ఏపీలో కాంగ్రెస్ విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారని,హైకోర్టులో ఓవో నంబర్ 1 ను కొట్టి వేయడం శుభపరిణామంగా పేర్కొన్నారు. కర్ణాటకలో గెలిచాం... తెలంగాణలో గెలుస్తున్నాం.. ఏపీలో గెలవబోతున్నామని, బీజేపీ అనే మూడు పార్టీలను ఓడించి కాంగ్రెస్ ని గెలిపించాలని కోరుతున్నామని పిలుపునిచ్చారు.
గుంటూరులో కాంగ్రెస్ విజయోత్సవాలు..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధిచటంపై గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు జరిగాయి. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగెస్ పార్టీ విజయం సాధించడం ప్రజలలో బీజేపీ పార్టీపై వ్యతిరేకతకు ప్రత్యేక నిదర్శనమని, ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు పోరాటమే కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రధాని మోడీ మతం పేరుతో రాజకీయాలు చేయడం వల్లనే బీజేపీ కర్ణాటక రాష్ట్రం నుంచి దేశం వరకు పతన స్థాయికి చేరుకుందని, కర్ణాటక ఎన్నికలు బీజేపీ మోసపు పాలనకు చెంపపెట్టని చెప్పారు. రాష్ట్రాలలో ఇతరపార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల మాదిరిగా కొని ప్రభుత్వాలు కూల్చుతూ పోతున్న మోడీ, అమిత్ షాలు తమ తీరు మార్చుకోవాలన్నారు.
బజరంగ్ దళ్ పేరిట రాజకీయాయిలు చేయటానికి బీజేపీ పన్నగాలు చేస్తున్నారు. దాని ప్రభావం కర్ణాటక ఎన్నికల్లో తీవ్ర దుమారం లేపాయని తెలిపారు. మోడీ కర్ణాటకలో ఏడుస్తూ తన నటనను ప్రదర్శించినా కన్నడ ప్రజలు ఓటుతో కొట్టారని ఎద్దేవాచేశారు. అమిత్ షా ఎన్నికల హామీలను కర్ణాటక ప్రజలు నమ్మలేదు అందుకే కర్ణాటక నుంచి తరిమికొట్టారని చెప్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కర్ణాటక ఎన్నికలు కొత్త మార్పును సూచిస్తున్నాయన్నారు.ఏపీకి రాజధాని ఏమిటని కన్నడ ప్రజలు ప్రశ్నించారు ఏమి చెప్పాలో అర్థం కాలేదని తెలిపారు. కులాలకు మతాలకు వ్యతిరేకమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమన్న విషయం మరో సారి స్పష్టం అయ్యిందన్నారు. దేశంలో కాంగ్రేస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా మారిందన్నారు.