పోలవరం పనులకు నిధులు తెచ్చేందుకు కేంద్రానికి ప్రతిపాదనల్ని పంపాలి: అధికారులతో జగన్ సమీక్ష
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పోలవరం పనులు పూర్తి చేసేందుకు అవసరం అయిన నిధులను కేంద్రం నుండి తెప్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరం అయిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని ఆయన సూచించారు.
సాగునీటిపై అధికారులతో జగన్ సమీక్ష...
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. ప్రధానంగా సాగు నీటి సరఫరాకు సంబందించిన అంశాల పై జగన్ అధికారులతో కూలకుషంగా చర్చించారు. క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదలచేశామని వెల్లడించారు.
పోలవరంపై అధికారులతో సమీక్ష...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని సీఎం జగన్ కు అధికారులు వివరించారు. గ్యాప్-2 వద్ద కూడా ఇదే పనులు చురుగ్గా సాగుతున్నాయని, కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్ బండ్‌లో కుంగిన ప్రాంతాన్ని ఇప్పటికే పరిశీలించటం జరిగిందని అన్నారు. నేల స్వభావంలో మార్పలు కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ వెల్లడించిందని, అందుకు సంబంధించిన నివేదికను అధికారులు సీఎం ముందు ఉంచారు.
ఆ ప్రాంతానికి తీసుకుంటున్న చర్యలు ఇవీ..
దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్‌తో, సిమెంట్ స్లర్రీతో నింపాలని, గేబియన్స్‌తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిన క్రమంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి విశ్లేషణ తర్వాత శాశ్వతంగా చేయాల్సిన మరమ్మతులను సూచిస్తామని కమిటి వెల్లడించడంతో తదుపరి చర్యల పై కూడా అధ్యయనం జరుగుతుందని అన్నారు. పోలవరం తొలి దశ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, కేంద్ర కేబినెట్లో పెట్టేందుకు కేబినెట్ నోట్ తయారీపై వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించిన క్రమంలో, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్దితి...
రాష్ట్రంలో మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పై సీఎం జగన్ అదికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తి ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించుకోవాలన్నారు. వెలగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను కూడ జగన్ సమీక్షించారు. అవుకు రెండో టన్నెల్ నిర్మాణం, చివరి దశలో లైనింగ్ కార్యక్రమం ఉందని, ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోభివృద్ధి పై కూడ సీఎం జగన్ అధికారులను ఆరా తీశారు. మొదటి టన్నెల్ పూర్తయ్యిన సందర్భంగా రెండో టన్నెల్ పనులు కూడా కొలిక్కి వస్తాయని చెప్పారు.