Asha Workers Agitation: రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళనలు, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్
పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు విస్మరించారని ఆశా వర్కర్లు ఆరోపించారు. కొత్త పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.15 వేలు చేయాలని విశాఖలో ఆందోళనకు దిగారు.
![Asha Workers Agitation: రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళనలు, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ AP Asha workers Agitation demanding minimum wage as per new PRC Asha Workers Agitation: రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళనలు, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/d2b095e6010eb0706db1b38763d8b8db_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు(Asha Workers) కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేపట్టారు. విశాఖ(Visakha) జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రం అందించేందుకు ప్రయత్నించిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. విశాఖ జగదాంబ వద్ద సీఐటీయూ కార్యాలయంలో ఆశా వర్కర్స్ నగర గౌరవ అధ్యక్షురాలు మణితో సహా పలువురు కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. సీఐటీయూ(CITU) కార్యాలయం బయట భారీగా పోలీసులను మోహరించారు. ఆశా వర్కర్లను డీఎంహెచ్ఓ(DMHO) కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆశా వర్కర్ల నగర అధ్యక్షురాలు మణి మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లే కార్యకర్తలను అరెస్టులు చేయడం దారుణం అన్నారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్(CM Jagan) ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. చంద్రబాబుకు మించి వైసీపీ ప్రభుత్వం(Ysrcp Govt) తమను నిర్భదిస్తోందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్య అని అన్నారు
సీఐటీయూ నిరసన
ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. ఇందులో భాగంగా సీతంపేట బీవీకే కళాశాల వద్ద నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సీహెచ్ నర్సింగ్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచాలని, అలెవెన్సులు ఇవ్వాలని కోరుతున్న ఆశా వర్కర్లను అరెస్టు చేయడం దారుణమని నర్సింగ్ రావు అన్నారు. సీఐటీయూ కార్యాలయానికి సైతం పోలీసులను పంపి అరెస్టు చేయించడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. యావత్ కార్మికవర్గం ఆశా వర్కర్లకు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ఆశావర్కర్లతో చర్చించి వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ముందస్తు అరెస్టులు
కనీస వేతనాలకై రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలో భాగంగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు(Police) ముందస్తు అరెస్ట్ లు చేశారు. పెదగంట్యాడ నుంచి బయలుదేరిన ఆశా కార్యకర్తలను న్యూ పోర్ట్ పోలీసులు స్టేషన్ కి తరలించారు. సీఐటీయూ నాయకుడు కొవిరి అప్పలరాజు, ఆశా కార్యకర్తలు ఎన్ హేమలత, జి. కుమారి, పి.సోమేశ్వరి మాట్లాడుతూ నూతన పీఆర్సీ(PRC) విధానాన్ని అనుసరించి కనీస వేతనం రూ.15 వేలు చేయాలని డిమాండ్ చేశారు. నెలనెలా ఇచ్చిన జీతాన్ని రెండు దఫాలుగా చెల్లించడం కరెక్ట్ కాదన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తూ సంక్షేమ పథకాలను అందకుండా చేశారని దీని వలన అన్ని విధాలా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలకు వారాంతపు సెలవు అమలుచేయాలని కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)