Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Weather Updates : బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల విస్తరణ, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Updates : నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల దక్షిణ భాగాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఇంటీరియర్ కర్నాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ అంతర్గత కర్నాటక మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ లో
ఏపీలో రాగల మూడు రోజుల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వెల్లడించింది. అయితే ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చెయ్యలేదు.
తెలంగాణలో
తెలంగాణలో పలు జిల్లాల్లో శుక్రవారం వర్షం పడింది. వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కోటిపల్లి, దుడ్యాలల్లో 10 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదు అయింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 22 జిల్లాల్లో వర్షం కురిసింది. అయితే శనివారం ఉదయం వరకు కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో వాతావరణం కాస్త చల్లబడింది.
బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న క్రమంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వాతావరణం క్రమంగా చల్లబడుతుంది. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో 40 డిగ్రీలపైన నమోదు అవ్వగా, 6 జిల్లాల్లో 39 డిగ్రీలపైన రికార్డయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా 30 డిగ్రీలు నమోదు అయ్యాయి.
Also Read : Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా