AP Cabinet meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40 అంశాలపై చర్చ..! అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్?
ఏపీ కేబినేట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ కానుంది. నేడు జరగబోయే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ (సెప్టెంబర్ 16) ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 40 అంశాల అజెండాతో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది. దీంతో పాటుగా పలు ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాల ఏర్పాటు అంశంపై ప్రతిపాదనలు చేయనుంది. స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటు అంశంపై చర్చించనుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను నిర్దేశించే అంశంపై అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఈ తరహా అథారిటీలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఆర్గానిక్ ఫాంగా గుర్తించిన సంస్థలు మాత్రమే ఉత్పత్తులు విక్రయించేలా కొత్త విధానం తీసుకురానుంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించడంతో పాటు సంక్షేమ పథకాల నిర్వహణ, కోవిడ్ వల్ల వచ్చిన నష్టాలు, వర్షాలతో మునిగిన పంటలు, రైతులకు సాయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది.
ఏకలవ్య పాఠశాల ఏర్పాటుపై చర్చ..
గృహాలు మంజూరైన లబ్ధిదారులకు రూ.35,000 అదనపు రుణాన్ని ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. ఆసరా పథకం కింద రెండో విడత మొత్తాన్ని విడుదల చేసే అంశానికి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. పాఠశాలలు, ఆస్పత్రుల పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించే దాతల పేర్లను పెట్టేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకొచ్చే అంశంపై మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది. విశాఖలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు ప్రతిపాదన గురించి కేబినెట్‌లో చర్చ సాగనుంది. బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం లభించనుండగా.. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది. హోంగార్డుల నియామకం సహా మొత్తం 40 అంశాలతో అధికారులు కేబినెట్ అజెండా రూపొందించారు.