AP Assembly Election 2024: ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధం, ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం
Andhra Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు మే 13న ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటింగ్ శాతం పెరగాలని భావిస్తోంది.
AP Assembly Election 2024 News Updates: అమరావతి: నేడు జరిగే ఏపీ ఎన్నికల్లో ప్రతి ఓటరు పాల్గొని ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ధృడమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ఎన్నికలు ఎంతో కీలకం అన్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్ లకు చేరుకున్న వారికి ఓటు హక్కు ఛాన్స్ ఇస్తారు. కొన్ని ప్రత్యేక నియోజకవర్గాల్లో 4, 5 గంటలకు పోలింగ్ ముగియనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
ఏపీలో మొత్తం ఓటర్ల వివరాలు ఇలా..
నేడు ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో మొత్తం 4,14,01,887 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లలో వీరిలో 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నాయి. వీరితో పాటు 3,421 మంది ట్రాన్స్ జండర్స్ ఉన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకుగానూ రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 12,438 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి, మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 31,385 పోలింగ్ కేంద్రాలు.. అంటే 75 శాతం కేంద్రాలను పూర్తి స్థాయిలో లోపలా, బయట కూడా వెబ్ కాస్టింగ్ తో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
83 శాతం ఓటింగ్ లక్ష్యంగా నేటి ఎన్నికలు
ఏపీలో గత ఎన్నికల్లో 79.84 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా పలు స్వీప్ కార్యక్రమాలు ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అప్రమ్తతం చేస్తూ దిన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస అవసరాలైన తాగునీరు, ర్యాంపులు, వికలాంగులు, వృద్ధులకు వీల్ చైర్లు, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచారు. అవసరాన్ని బట్టి వృద్దులకు, దివ్యాంగులకు కూడా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జీరో వయొలెన్సు లక్ష్యంగా త్రిబుల్ *సీ*
రాష్ట్రంలో జీరో వయొలెన్సు లక్ష్యంగా రాష్ట్రంలోని 75 శాతం పోలింగ్ కేంద్రాలను నిరంతర వెబ్ కాస్టింగ్ ద్వారా ఈసీ అధికారులు పర్యవేక్షిస్తారు. 26 జిల్లాలకు సంబందించి 26 టివీ మానిటర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. ఇందుకు దాదాపు 150 మంది అధికారులు, సిబ్బందికి నిరంతరాయంగా పనిచేస్తున్నారు.
1.60 లక్షల ఈవీఎంల వినియోగం
ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలలో 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎంలనుకూడా సిద్దంగా ఉంచారు. మొదట 46,165 పోలింగ్ కేంద్రాలకు 1.45 లక్షల ఈవీఎం లు సరిపోతాయని, అదనంగా ప్రతి పాదించిన 224 ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలకు మరో 15 వేల ఈవీఎంలు సమకూర్చారు. పోలింగ్ శాతం పెరుగుతుందని ఏపీ సీఈవో అంచనా వేశారు.