Andhra News: 'బర్రెలక్క ధైర్యంగా ముందుకు సాగుతున్నారు' - ఆమె అందరికీ ఆదర్శమన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
Laxminarayana Comments: పస్తుతం యువత రాజకీయాల్లోకి రావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కర్నె శిరీష అందరికీ ఆదర్శమన్నారు.
CBI Ex JD Laxmi Narayana Comments on Barrelakka: ప్రస్తుతం యువత రాజకీయాల్లోకి వచ్చి కొత్త ఒరవడి సృష్టించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కర్నె శిరీష (బర్రెలక్క)కు తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. 'ఆమె ఎన్నికల్లో నిలబడి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఆమె మనందరికీ ఆదర్శం. మూస రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాల్సిన అవసరం ఉంది. యువత రాజకీయాల్లోకి వస్తే నా ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది.' అని పేర్కొన్నారు.
'యువత చేతుల్లోనే అంతా'
భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని లక్ష్మీ నారాయణ అన్నారు. శిరీషను తాను శనివారం కలిశానని, ఆమె గెలిస్తే ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తానని చెబుతున్నారని వెల్లడించారు. ఓ బాధ్యత కలిగిన పౌరుడిగా ఆమె వెనుక నిలబడాలనే మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో నాయకులు వారే ఉంటున్నారని, పార్టీలు అవేనని, దీంతో కొత్త వారు పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయని అన్నారు. కాబట్టి యువత రాజకీయాల్లోకి రావడాన్ని తాను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అసలెవరీ బర్రెలక్క.?
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన కర్నె శిరీష తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ కాకపోవడంపై ప్రశ్నిస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. నోటిఫికేషన్లు రాక తాను బర్రెలు కాసుకుంటున్నట్లు అందులో చెప్పారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమె పాపులర్ అయి ఫాలోయర్లు పెరిగారు. అప్పటి నుంచి బర్రెలక్కగా పేరొందారు. తాజాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నుంచి బరిలో నిలిచారు. తాను గెలిస్తే నిరుద్యోగులు, ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆమెకు పలువురు ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభించింది. సోషల్ మీడియాలోనూ ఆమెకు ఓటేసి గెలిపించాలని కొందరు నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.
ప్రచారంలో దాడి
అయితే, ఇటీవల పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై కూడా దాడి చేశారు. దీంతో తనకు 2+2 భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు మద్దతుగా అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్, ఆదిత్య సైతం అండగా నిలిచారు. ఆమె పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆమెకు భద్రత కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఆమె ఓ గన్ మెన్ ఉండాలని స్పష్టం చేసింది. కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకు మాత్రమే భద్రత కల్పించడం సరికాదని, ముప్పు ఉన్న ప్రతి అభ్యర్థికి సెక్యురిటీ ఇవ్వాలని హైకోర్టు నిర్దేశించింది. ఈ క్రమంలో ఆమెకు భద్రత కల్పించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
Also Read: Nara Lokesh: కాకినాడలో యువ వైద్యుడి ఆత్మహత్య, వైసీపీ నేతల భూదాహమే కారణమంటూ లోకేశ్ మండిపాటు