AP finance matters : మనీ మ్యాటర్స్... ఢిల్లీలో బుగ్గన టీం... గవర్నర్ వద్దకు సీఎం జగన్ ..!
ఆర్థిక శాఖ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని ముగ్గురు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మరో వైపు గవర్నర్‌ను సీఎం జగన్ కలిశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల విషయంలో తీరిక లేకుండా ఉంటోంది. ఓ వైపు జీతాలు, పెన్షన్ల చెల్లింపుల టెన్షన్.. మరో వైపు కేంద్రం ఇచ్చిన నోటీసుల వివరణలు.. అలాగే.. మరో వైపు అసలు ఆర్థిక సమచారం బయటకు ఎలా లీక్ అవుతుందోనన్న విచారణ .. అన్ని అన్ని కోణాల్లోనూ ఏపీ ప్రభుత్వం హడావుడిగా కనిపిస్తోంది.
ఢిల్లీలో ఆర్థిక మంత్రి సహా ఉన్నతాధికారులు..!
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, ఆ కార్పొరేషన్‌పై తీసుకున్న రుణాల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు వివరణ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులంతా ఢిల్లీకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధమని.. అలాగే దానికి మద్యం ఎక్సైజ్ పన్నును మళ్లించడం మరో తప్పిదమని... కేంద్ర ఆర్థికశాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో అధికారులు ఐదు రోజుల పాటు కసరత్తు చేసి ఏం చెప్పాలో నిర్ణయించుకుని ఢిల్లీ చేరుకున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. వరుసగా కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమవుతున్నారు. హైకోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. ఆర్థిక శాఖ ముఖఅయ కార్యదర్శఇ ఎస్‌ఎస్ రావత్.. ఢిల్లీలో ఉన్నారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కూడా ఢిల్లీకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
సమాచారం లీక్ చేస్తున్నారని ముగ్గురు ఆర్థిక శాఖ ఉద్యోగులపై వేటు..!
మరో ఏపీ ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి కీలక సమాచారం మీడియాకు వెళ్తోందని అనుమానిస్తూ.. ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్ష్ వేటు వేస్తూ జీవో జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లు, తో పాటు వరప్రసాద్ , శ్రీను బాబు అనే ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లు కీలక సమాచారం బయటకు చేరవేస్తున్నారని ప్రభుత్వం అభియోగాలు మోపింది. విచారణ పూర్తయ్యే వరకూ హెడ్ క్వార్టర్ దాటి పోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు.. ఇతర సమచారం మీడియాలో విస్తృతంగా వస్తోంది. ఇవన్నీ ఈ ముగ్గురు అధికారులే లీక్ చేస్తున్నారని ప్రభుత్వం అనుమానించింది.
సతీమణితో కలిసి గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్..
ఓ వైపు ఆర్థిక పరంగా హై టెన్షన్ పరిస్థితులు ప్రభుత్వంలో కనిపిస్తూండగా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పుల విషయంలో గవర్నర్ వ్యవహారశైలిపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ రూ. నలభై ఒక్క వేల కోట్ల నిధుల లెక్కలు లేకపోవడంపైనా.... అప్పుల అంశంపైనా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు. కేంద్రం స్పందించినా గవర్నర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఎపీఎస్‌డీసీ కార్పొరేషన్,... తనఖా రుణాలు గవర్నర్‌ను గ్యారంటీర్‌గా చూపించడం వంటి అంశాలపై వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.