Visakhapatnam Gas Leak: అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లో అమ్మోనియా వాయువు లీక్, 100 మందికి పైగా అస్వస్థత
Visakhapatnam Gas Leak: అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజెడ్ లో పోరస్ కంపెనీలో అమ్మోనియా వాయువు లీక్ అయింది. వాయువు సమీపంలోని సీడ్స్ యూనిట్ లో వ్యాపించి పదుల సంఖ్యలో మహిళలు అస్వస్థతకు గురయ్యారు.
Visakhapatnam Gas Leak : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజెడ్ లోని సీడ్స్ యూనిట్ లో అమ్మోనియా వాయువు లీక్ అయింది. ఒక్కసారిగా ఘాటైన వాయువు వ్యాపించడంతో అక్కడి మహిళా ఉద్యోగులకు ఒక్కసారిగా వాంతులు, తల తిరగడంతో సహా ఆరోగ్య సమస్యలకు గురయ్యారు. పలువురు మహిళలు వారిని స్పృహ కోల్పోడంతో బ్రాండిక్స్ ఎస్ఈజెడ్ లోని ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారిని వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
పోరస్ కంపెనీలో లీకేజీ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ ఎస్ఈజెడ్ లోని పోరస్ కంపెనీలో అమ్మోనియా వాయువు లీకైంది. వాయువు వ్యాపించడంతో సమీపంలోని సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. అమ్మోనియా వాయువు పీల్చడంతో మహిళలకు తల తిరగడం, కళ్ల మంటలు, వాంతులు అయ్యాయి. పదుల సంఖ్యలో మహిళలను సెజ్ లోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. అమ్మోనియా గ్యాస్ పీల్చడంతో మహిళలు స్పృహ కోల్పోయారని, ప్రాణాపాయం లేదని వైద్యులు అంటున్నారు. మరోవైపు పోరస్ కంపెనీలో అమ్మోనియా లీకేజీని నిర్థారించేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీఎం జగన్ ఆరా
అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్, బ్రాండెక్స్‌లో పనిచేస్తున్న మహిళలకు అస్వస్థత ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్యాస్ లీక్‌ను నియంత్రించారని అధికారులు తెలిపారు. బ్రాండిక్స్‌లో ఒక యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలను అందర్నీ ఖాళీ చేయించామన్నారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని వివరించారు. అమ్మోనియా ఎక్కడ నుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరివెళ్లారు.
విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో గ్యాస్ లీక్‌ఘటనపై సీఎం వైయస్.జగన్ ఆరా. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యం అందించాలని ఆదేశాలు. ఘటన స్థలాన్ని సందర్శించాల్సిందిగా స్థానిక మంత్రికి ఆదేశం. ఘటనపై దర్యాప్తు జరిపి, మళ్లీ పునరావృతంకాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 3, 2022