Jagan Meeting : సీఎం జగన్ సభలో అపశ్రుతి- బస్సు నుంచి జారి పడిన 70 ఏళ్ల వృద్ధురాలు!
రాజమండ్రి సీఎం జగన్ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. బస్సు నుంచి జారి పడి వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.
Jagan Meeting : రాజమండ్రిలో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన బహిరంగసభలో అపశ్రుతి చోటు చేసుకుంది. వృద్ధులకు ఈ నెల నుంచి రూ. 250 పెన్షన్ పెంచినందున వారితో ముఖా ముఖి కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెన్షన్లు పొందుతున్న వృద్ధులను వాలంటీర్లు సభకు తీసుకు వచ్చారు. చాలా మంది 70 ఏళ్లు పైబడిన వాళ్లు కావడం.. బస్సులు ఎక్కి , దిగలేని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా వాలంటీర్లు అంగీకరించలేదు. జగన్ సభకు రాకపోతే పెన్షన్లు ఆపేస్తామని హెచ్చరించి బలవంతంగా బస్సులు ఎక్కించారు.
బస్సు నుంచి కిందపడ్డ వృద్ధు రాలు - కాళ్ల పై నుంచి వెళ్లిన కారు
ఇలా బస్సుల్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ లో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి వై ఎస్ ఆర్ పింఛను కానుక సభ వద్దకు వచ్చిన బస్సుల నుంచి దిగే సమయంలో 70 ఏళ్ళకు పైగా వృద్ధురాలు జారిపడిపోయింది. రోడ్డు మీద పడిపోవడంతో.. వెంటనే పక్కన వేరే వాహనం ఆ వృద్ధురాలు మీదకు ఎక్కడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
సభలు, సమావేశాలు నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన బహిరంగసభల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వం నిన్న రాత్రే.. బహిరంగసభలు, సమావేశాలపై నిషేధం విధించింది. పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా తెలిపింది. అయితే సీఎం జగన్ సభకు మాత్రం.. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా.. పించన్ అందుకుంటున్న వృద్ధులను వాలంటీర్ల సాయంతో తరలించారు. పెద్ద వయసు ఉన్న వారు ఇబ్బంది పడినా.. పట్టించుకోలేదు. తామే తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకు వస్తామని చెప్పి తీసుకెళ్లారు కానీ.. ఆ వృద్ధులు కొన్ని గంటల పాటు సభలో నిల్చుకోవడానికి .. కూర్చోవడానికి ఇబ్బందులు పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వృద్ధురాలిని ఎవరూ పరామర్శించలేదన్న విమర్శలు
రాజమండ్రిలో సీఎం జగన్ సభ కోసం వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ రాక సందర్భంగా రాజమహేంద్రవరం మొత్తాన్ని దిగ్బంధించారు. అనేక చోట్ల రోడ్లను కూడా మూసివేయడంతో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం తీరుపై పలు చోట్ల స్థానికులు అధికారులు, పోలీసులతో గొడవ పడ్డారు. సీఎం రాక సందర్భంగా ప్రతీ చోటా బారీకేడ్లు, పరదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి రాజమండ్రిలో మరింత ఎక్కువగా భద్రత ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా 70 ఏళ్ల వృద్ధ మహిళ తీవ్రంగా గాయపడటం కలకలం రేపింది. ఆమె ఆస్పత్రిలో కూడా ఎవరూ పరామర్శించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై ర్యాలీలు, సభలు బంద్- హోంశాఖ కీలక ఆదేశాలు!