(Source: ECI/ABP News/ABP Majha)
Jagan vs Lokesh: నాణ్యమైన విద్యకు గండి అన్న జగన్ - ఇంతకీ ఏం చదివావో చెప్పాలంటూ లోకేష్ కౌంటర్
Jagan Lokesh Tweet War: పాఠశాలల రూపురేఖలు మార్చానని జగన్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు లోకేష్. జగన్ నిజంగానే అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు.
Andhra Pradesh News | అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థులు CBSE బోర్డ్ పరీక్షలు రాసి ఉండేవారు. కానీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ ప్యాట్రన్ పక్కనపెట్టారు. CBSE విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదికి వారంతా SSC బోర్డ్ పరీక్షలే రాసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ ట్వీట్ వేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలను కూటమి ప్రభుత్వం ఎందుకు పక్కనపెడుతోందని ప్రశ్నించారు. ఈ ట్వీట్ కి నారా లోకేష్ స్పందించారు. విద్యా శాఖ గురించి జగన్ లెక్చర్లు ఇవ్వడం వింతగా ఉందన్నారాయన. జగన్ విమర్శలు, నారా లోకేష్ విమర్శలు.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఇంతకీ జగన్ ట్వీట్ ఏంటి..?
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ విద్యార్థులకు CBSE విధానాన్ని రద్దు చేయడంపై జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ స్కూళ్లలో కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించి సిలబస్ మార్చి బోధనలో మార్పులు తీసుకొచ్చినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రద్దు చేసిందని, ఇది సరికాదని అన్నారాయన. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని దీనివల్ల మరోసారి రుజవైందని తన ట్వీట్ లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడుతో బడుల రూపు రేఖలు మార్చామని, ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టామని, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్ లను ముందుచూపుతో తీసుకొచ్చామని చెప్పారు జగన్. పేద పిల్లల తలరాతలు మార్చే ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని, కానీ కొత్త ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయాన్ని రద్దు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతలకు చెందిన ప్రైవేట్ స్కూల్స్ ని ప్రోత్సహించేందుకు, ప్రభుత్వ స్కూళ్లను దెబ్బతీస్తున్నారని విమర్శించారు జగన్. ఆ ట్వీట్ లో చంద్రబాబుతోపాటు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ని కూడా మెన్షన్ చేశారు.
1.@ncbn గారూ.. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2024
జగన్ ట్వీట్ కి లోకేష్ బదులిచ్చారు. ఏం చదివారో.. ఎక్కడ చదివారో తెలియని జగన్ ఇలాంటి లెక్చర్లివ్వడం వింతగా ఉందన్నారు లోకేష్. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం జగన్ నిర్ణయాలు తీసుకునేవారని తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు. ఆ నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారాయన్నారు. CBSE విధానం ప్రవేశపెట్టినా.. పిల్లలకు పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్యాలు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచించలేదని, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అన్నారు. జగన్ నిర్ణయం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 75వేల మంది టెన్త్ క్లాస్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు లోకేష్. నిపుణులతో తాము చర్చిస్తామని, వచ్చే విద్యాసంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొస్తామని అన్నారు.
ఏం చదివావో తెలియదు..ఎక్కడ చదివావో అస్సలు తెలియదు..నువ్వు విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం
— Lokesh Nara (@naralokesh) September 16, 2024
మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సిబిఎస్ఈ విధానంలో… https://t.co/bMd4dvM9ou
వైసీపీ దిగిపోయేటప్పుడు పిల్లలకు ఇచ్చే కోడి గుడ్లు, చిక్కీలు, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిందని అన్నారు లోకేష్. అలాంటి కంసమామ జగన్ అని సెటైర్లు పేల్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చానని జగన్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ నిజంగానే అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పాలని నిలదీశారు.