చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
చింతామణి పుస్తకాన్ని నిషేధించనప్పుడు నాటకాన్ని ఎందుకు నిషేధించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలకు మంగళవారం వరకు గడువు ఇచ్చింది.
చింతామణి నాటకం నిషేధంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
చింతామణి నాటక నిషేధంపై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. నాటకంలో ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించనప్పుడు నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారని ఆక్షేపించింది.
ప్రభుత్వానికి వచ్చిన వినతుల ఆధారంగా నాటకాన్ని నిషేధించామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వచ్చే మంగళవారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించిన కోర్టు విచారణను ఆ రోజుకే వాయిదా వేసింది.
చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ఈనెల 17వ తేదిన ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దీనిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు.
దేవదాసి వ్యవస్థపై అవగాహన, వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త, కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారని పిటిషన్‌లో వివరించారు రఘురామకృష్ణరాజు. 1920 నుంచి ఎలాంటి అవరోధం లేకుండా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని గుర్తుచేశారు పిటిషన్ తరుపు న్యాయవాది.
ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనన్నారు పిటిషనర్ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేలమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని పూర్తిగా నిషేధిస్తే వారు రోడ్డునపడతారని పేర్కొన్నారు.
ఈ నాటకం ప్రదర్శించిన కళాకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గతంలో పలు అవార్డులు, బహుమతులు ఇచ్చాయని ఈ సందర్బంగా గుర్తుచేశారు.
కళాకారుడు స్థానం నరసింహారావును 1956లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయవిచారణ జరిపి, ప్రభుత్వం జారీచేసిన జీవో 7ను రద్దు చేయాలని అభ్యర్థించారు.