Janasena : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు- జనసేనకు డిప్యూటీ- పోటీలో బొలిశెట్టి, మండలి
Andhra Pradesh Speaker: ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు దాదాపు ఖరారు అయ్యారు. అదే టైంలో డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనను వరించనుంది. దీని కోసం ఇద్దరు సీనియర్ లీడర్లు పోటీ పడుతున్నారు.
Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మరో కీలక పదవి వరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో జనసేనకు సముచిత స్థానం కల్పించారు. మూడు మంత్రిపదవులు ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కి ఉప ముఖ్యమంత్రి చేశారు. ఈ క్రమంలోనే మరో కీలకమైన బాధ్యతను జనసేన నేతలకు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. దీంతో వాళ్లకు మూడు మంత్రిపదవులు దక్కాయి. దీంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వరించింది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ రేసులో తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో లోకం మాదవి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది.
ఇప్పటి వరకు స్పీకర్ ఎవరనేది తేలలేదు. చాలామంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ అయ్యన్నపాత్రుడు పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తన సన్నిహితుల వద్ద కూడా ఈ విషయాన్ని అయ్యన్న ప్రస్తావించినట్టు చెప్పుకుంటున్నారు. స్పీకర్ పదవి అయ్యన్నకు దాదాపు ఖరారు అయిపోయిందని అంటున్నారు. ఇప్పుడు డిప్యూటీ కూడా బుద్దప్రసాద్, బొలిశోట్టి, లోకం మాధవిలో ఒకరి ఖరారు కానుంది.
బుధవారం నుంచి తొలి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదట ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ నాయకుడు ఉంటారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక జరుగుతుంది. మరోవైపు చీఫ్‌విప్ పదవి టీడీపీ సీనియర్ నేత దూళ్లిపాళ్ల నరేంద్రకు ఇవ్వనున్నారని సమాచారం.