Mangalagiri AIMS: రేపు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ, మరింత మెరుగైన సేవలు అందిస్తామన్న ఎయిమ్స్ డైరెక్టర్
AIMS NEWS: మంగళగిరి ఎయిమ్స్ ను రేపు ప్రధాని మోడీ జాతికి అంకితమివ్వనున్నారు. దీంతోపాటు విశాఖలో నిర్మించిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ తో పాటు, మొబైల్ ఫుడ్ ల్యాబ్ లు ప్రధాని ప్రారంభించనున్నారు
Mangalagiri Aims:రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీ(AP)కి కేటాయించిన ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్య విద్యా సంస్థ ఏయిమ్స్(AIMS) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ ఆధునిక వైద్య దేవాలయాన్ని రేపు ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. మంగళగిరితోపాటు రాజ్ కోట, భటిండా, రాయబరేలి, కల్యాణి ఎయిమ్స్ ను సైతం మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
ఎయిమ్స్ ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం మంగళగిరి(Mangalagiri)లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అఖిల భారత వైద్య విద్యా సంస్థ ఎయిమ్స్(AIMS) ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమివ్వనున్నారు. అలాగే 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.అలాగే విశాఖ(Vizag)లో మైక్రో బయాలజీ పుడ్ టెస్టింగ్ ల్యాబ్ తోపాటు , నాలుగు మొబైలు పుడ్ టెస్టింగ్ ల్యాబ్ లను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ప్రధాని మంత్రి కార్యక్రమంలో రేపు గవర్నర్ అబ్దుల్ నజీర్ తోపాటు, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు పాల్గొననున్నారు.
రోగుల దేవాలయం
విభజన చట్టంలో భాగంగా ఏపీలో ఎయిమ్స్ నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం తలపెట్టగా..అప్పటి తెలుగుదేశం(TDP) ప్రభుత్వం మంగళగిరి సమీపంలో 183 ఎకరాలు కేటాయించింది. రూ.1618 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కేంద్ర ప్రభుత్వమే ఎయిమ్స్ నిర్మించింది. ఇక్కడ వైద్యకళాశాల(Medical Collage), మెడికల్ ల్యాబ్, నర్సింగ్ కళాశాల, ఆపరేషన్ థియేటర్లతోపాటు, ఇన్ పేషెంట్, అత్యవసర సేవలు, రెసిడెన్సియల్ బ్లాక్, గెస్ట్ హౌస్ , అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ తోపాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించారు. 2019 మార్చి నుంచే రోగులకు సేవలు అందిస్తున్నారు. రోజుకు రెండున్నర వేలమంది రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే 15 లక్షల మందికి ఓపీ సేవలు అందగా....మరో 20 వేల మంది ఇన్ పెషెంట్ గా జాయిన్ అయి చికిత్సలు పొందారు. మరో 12 వేల మందికి అత్యవసర చికిత్సలు అందించారు. 2018 నుంచే ఎంబీబీఎస్ (MBBS)సీట్లు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైద్యకళాశాలలో 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో వందమంది వివిధ కోర్సుల్లో పీజీ చదువుతున్నారు. ఈ ఏడాది నుంచే పారామెడికల్ కోర్సులను సైతం అందుబాటులోకి తేనున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఎయిమ్స్ భవనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఇంకా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. పేద రోగులంతా ఈ సౌకర్యాలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. అత్యంత క్రిటికల్ చికిత్సలకు సైతం సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
సుందర నిర్మాణాలు
అత్యంత ప్రశాంత వాతావరణంలో కొండపక్కన ఎయిమ్స్ కు భూములు కేటాయించారు, దీనికి కృష్ణానది నుంచి నిరంతరం నీరు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 183.11 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి నిర్మించారు. 125 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలతోపాటు ఇతర నిర్మాణాల కోసం కేంద్రం రూ.1,618.23 కోట్లు ఖర్చు చేసింది. విశాఖలో రూ. 4.76 కోట్లతో చేపట్టిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీ, రూ.2.07 కోట్లతో నెలకొల్పిన 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీలను సైతం ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతోపాటు రూ. 22 కోట్లతో చేపట్టనున్న 9 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేస్తారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.