Nara Lokesh: లాంతరు పట్టుకొచ్చిన నారా లోకేశ్, ‘వారిద్దరూ గాడిదలు కాస్తున్నారా?’ అని ఫైర్
Nara Lokesh Protest: లాంతరు చేత పట్టుకుని లోకేశ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. 'అంధకార ప్రదేశ్' పేరుతో ఈ లాంతరు నిరసన చేపట్టారు.
AP Power Charges: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) వినూత్నంగా నిరసన తెలిపారు. లాంతరు చేత పట్టుకుని ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. 'అంధకార ప్రదేశ్' పేరుతో ఈ లాంతరు నిరసన చేపట్టారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడేలా ఛార్జీలు పెంచారని.. ధనవంతులకు మాత్రం తక్కువ భారం పడేలా ఛార్జీలు పెంచారని విమర్శించారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడారు. ‘‘జగన్ మోసపు రెడ్డి ఏపీలో కొత్త పథకం తెచ్చారు. ఉగాది నుంచి పేదలపై ఛార్జీలతో బాదేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రమాణస్వీకారం నాడు రెండు చేతులూ ఊపుతూ జగన్ ఆవేశంగా చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.12 వేల కోట్లు లాగేశారు. అనేక పేర్లతో విద్యుత్ ఛార్జీలను పెంచి డబ్బులు లాగేశారు. చెత్త పన్ను వేశారు.. ఇంటి పన్ను పెంచారు.. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడేట్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. ధనవంతులకు మాత్రం తక్కువ భారం పడేలా ఛార్జీలు ఉన్నాయి. పేదలు బాధపడాలి.. మధ్య తరగతి వారు ఇబ్బంది పడాలి.. ఇదేనా జగన్ విధానం?’’
‘‘తాడేపల్లి ప్యాలెస్‌కు విద్యుత్ ఛార్జీలు పెరగకూడదనుకున్నారా? ఎక్కువ వాడే వారికి తక్కువ పెంచారు. పీపీఏలు రద్దు చేయడం వల్లే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. పీపీఏలను కొనసాగించి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే పరిస్థితే ఉండేది. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచనేలేదు. ఛార్జీలను తగ్గించే దిశగా చంద్రబాబు కృషి చేశారు. ప్రజలందరూ లాంతర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చారు. 2019 ఎన్నికల ముందున్న స్లాబులను అమలు చేయాలి. అంతేకాక, రాష్ట్రంలో అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు.
జగన్ బయటకొస్తే పులివెందులకు వెళ్లి విద్యుత్ ఛార్జీలపై అక్కడి ప్రజల అభిప్రాయాలే తెలుసుకుందాం. చంద్రబాబు పండుగ నాడు నిత్యావసరాలు ఇచ్చి కానుకలిస్తే.. విద్యుత్ ఛార్జీలను పెంచి జగన్ ఉగాది కానుక ఇచ్చారు. టీడీపీ కార్యాలయంలో, పక్కనున్న డీజీపీ కార్యాలయంలో కూడా మధ్యాహ్నాం 12 గంటల నుంచి 2:10 గంటల వరకు కరెంట్ లేదు. జగన్ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతానికే విద్యుత్ కోతలు ఉన్నాయి. విద్యుత్ లోటు వల్ల ఓపెన్ మార్కెట్టులో రూ. 9, రూ. 10 ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్టులో విద్యుత్ కొనుగోలు చేసే అంశంలో కూడా కుంభకోణం చేశారు. త్వరలోనే బయట పెడతాం. చంద్రబాబు అమలు చేసిన సంస్కరణల వల్ల ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంది.. ఇప్పుడు ప్రభుత్వ చర్యల వల్ల విద్యుత్ లోటు రాష్ట్రంగా మారింది.
‘‘ఏపీలో విద్యుత్ లోటు ఉంటే సీఎం, మంత్రి గాడిదలు కాస్తున్నారా..? విభజన తర్వాత ఏపీ పరిస్థితి గురించి మాట్లాడుతోంటే సత్తిబాబు గతాన్ని తవ్వుతున్నారు. సత్తిబాబుకు మెమరీ తక్కువ. 2004 ముందు ఏ జరిగిందో చర్చిద్దామంటే.. మేం సిద్దమే. 2004 తర్వాత చంద్రబాబు ఏదేదో తప్పులు చేశారంటూ 24 విచారణలు చేసినా ఏ తప్పు పట్టుకోలేకపోయారు. సత్తిబాబు వోక్య్ వ్యాగన్ కంపెనీని వెళ్లగొడితే.. చంద్రబాబు కియా తెచ్చారు. బొత్స చెప్పినట్టు ఇవి ఈఆర్సీ ప్రతిపాదనలే అయితే.. వాటిని వెనక్కు తీసుకోండి. ఈఆర్సీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించకుంటే గొడవే లేదుగా..’’ అని నారా లోకేశ్ మాట్లాడారు.