Nepal Protests Gen Z:రేపు రాత్రి కల్లా స్వస్థలాలకు చేరుస్తాం- నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వారికి లోకేష్ భరోసా
Nepal Protests Gen Z: నేపాల్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ వాసులను రేపు రాత్రి కల్లా స్వస్థలాలకు రప్పిస్తామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

Nepal Protests Gen Z: నేపాల్‌లో ఉన్న తెలుగు వారిని 24 గంటల్లో స్వస్థలాలకు చేరుస్తామని భరోసా ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఉదయం నుంచి కంటిన్యూగా ఆపరేషన్ నేపాల్‌పై వర్కౌట్ చేసిన ఆయన మీడియాకు ఆ వివరాలు అందజేశారు. నేపాల్‌లో చిక్కుకున్న వారితో మాట్లాడామని వారిలో ధైర్యం నింపామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో వారందర్నీ రేపు రాత్రి కల్లా స్వస్థలాలకు చేరుస్తామని వివరించారు.
జెన్‌జీ ఉద్యమంలో అట్టుడుకుతున్న నేపాల్ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ పెట్టించాయి. అక్కడ ఉన్న బంధువులు క్షేమంగా వస్తారా లేదా అన్న భయం వారిలో నెలకొంది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆర్టీజీఎస్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం, నేపాల్‌లో ఉన్న రాయబార కార్యాలయంతో నిత్యం సంప్రదింపులు జరిపారు. తెలుగు వాళ్లు ఎంతమంది అక్కడికి వెళ్లారు చిక్కుకుపోయిన వారు ఎందరనే వివరాలు సేకరించారు.
అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంతో ప్రత్యేక గ్రూప్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కొ గ్రూప్‌నకు ఒక్కో టాస్క్ అప్పగించారు. ఇలా వివిధ రకాలుగా సమాచారాన్ని సేకరించి మొత్తంగా రెండు వందలమందికిపైగా నేపాల్‌లో ఉన్నట్టు లెక్కలు తేల్చారు. వారందర్నీ గురువారం సాయంత్రానికి ఇళ్లకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఉదయం పరిస్థితి చాలా తీవ్రంగానే ఉందని క్రమంగా పరిస్థితి మెరుగుపడిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అందరితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పామని వెల్లడించారు. నెపాల్‌లో ఏఏ ప్రాంతాల్లో ఎంతమంది వాళ్లు ఉన్నారో లోకేష్ వివరించారు. చాలా మందిని రోడ్డు మార్గంలో సురక్షితంగా తరలిస్తామని అన్నారు. 12 ప్రాంతాల్లో 217 మంది రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు.
ఖాట్మాండూలో 173 మంది, హిటాడోలో 22 మంది, పోక్రాలో 10 మంది, సినికోట్‌లో 12 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో ఎక్కువ మంది విశాఖ(42 )నుంచి ఉన్నారని ప్రకటించారు. విజయనగరం నుంచి 34 మంది,కర్నూలు నుంచి 22 మంది ఇరుక్కుపోయారని మిగతా జిల్లా వాసులు ఉన్నారని వివరించారు.
రేపు ఉదయం 10 గంటల నుంచి మరోసారి సమావేశమై ప్రతి ఒక్క ఆంధ్రుడు ఇంటికి తిరిగి వచ్చే వరకు మానిటరింగ్ చేస్తామని లోకేష్ తెలిపారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వారిని ఇంటికి చేరుస్తామన్నారు.





















