Jogi Ramesh: జోగి రమేశ్‌కు బిగిసిన ఉచ్చు! ఏపీ పోలీసుల నుంచి నోటీసులు
AP News: వైసీపీ హాయాంలో మంత్రిగా పని చేసిన జోగి రమేష్‌కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని జోగి రమేశ్ ను పోలీసులు ఆదేశించారు.
Jogi Ramesh News: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం (ఆగస్టు 14) మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు.
వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేశ్ దాడికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.
జోగి కుమారుడు కూడా అరెస్టు
మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడిని కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం కేసులో జోగి కుమారుడు రాజీవ్ ను అరెస్టు చేశారు. నేడు ఉదయం నుంచి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. జోగి రమేష్ కుమారుడు ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. విచారణ ద్వారా ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఏసీబీ అధికారులు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ అగ్రిగోల్డ్ కుంభకోణం కుట్రలో జోగి రాజీవ్ పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్న అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. అనంతరం గొల్లపూడి ఏసీబీ ఆఫీస్‌కు తరలించారు. ఈ కేసులో ఏ1గా జోగి రమేష్ బాబాయి ఉన్నారు. అయితే, ఇదంతా కక్షపూరితంగా సాగుతోందని జోగి రమేష్‌తో పాటు ఆయన కుమారుడు జోగి రాజీవ్ ఆరోపించారు.
డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి - జోగి రమేష్, మాజీ మంత్రి
‘‘మా అబ్బాయి అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేశాడు. చంద్రబాబూ, నీకు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్ అయిన భూములు ఎవరైనా కొంటారా?. నా మీద కక్ష తీర్చుకోవాలంటే తీర్చుకోండి. దయచేసి ఆలోచించుకోండి. ప్రభుత్వాలు మారుతుంటాయి. ఇలా కక్ష రాజకీయాలు, దుర్మార్గాలకు ఒడిగట్టొద్దు. రెడ్ బుక్ రాజ్యాంగం మాపై ఎందుకు అమలు చేస్తున్నారు?. ఇప్పటికైనా ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయండి. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి’’ అని అన్నారు.
కనీసం నోటీసులు ఇవ్వరా - పేర్ని నాని
పేర్ని నాని స్పందిస్తూ.. ‘‘కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతారు. అక్రమంగా అరెస్ట్‌లు చేస్తారు. అసలు ఈ కేసులో లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా?. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా జోగి రమేష్‌ను టార్గెట్ చేశారు. చంద్రబాబు మీకు ఒకటే చెబుతున్నాం. 175 నియోజకవర్గాల్లో మా కార్యకర్తలందరినీ జైల్లో వేసుకోండి. మేం సిద్ధంగా ఉన్నాం. నీ తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌లు అన్నీ ఎదుర్కొంటాం. మీకు చేతనైంది చేసుకోండి. మిమ్మల్ని నిలదీయకుండా వదలం. మేం న్యాయ పోరాటం, ధర్మ పోరాటం చేస్తాం. కచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. రాజకీయ పోరాటం చేస్తాం. 2029నాటికి నీ ప్రభుత్వాన్ని పడదోయడానికి కావాల్సిన అన్ని పోరాటాలు చేస్తాం’’ అని పేర్ని నాని స్పందించారు.