Jagananna Thodu: చిరువ్యాపారులకు జగనన్న తోడు-వడ్డీలేని రుణాలతో ముందుగానే సంక్రాంతి వచ్చిందన్న సీఎం
3.95లక్షల మంది లబ్ధిదారుల్లో 3.67లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణాలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.
ఏపీలోని చిరు వ్యాపారులకు మూడ్రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చేసిందన్నారు సీఎం జగన్. చిరువ్యాపారులకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తీసుకొచ్చిన ‘జగనన్న తోడు’ పథకం కింద ఆరోవిడతగా 3.95లక్షల మందికి రూ.395కోట్ల వడ్డీలేని రుణాలను బటన్ నొక్కి విడుదల చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లకు తోడుగా ఉంటూ వారికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు ముఖ్యమంత్రి జగనన్న. ఆరు విడతల్లో ఇప్పటివరకు రూ.2406కోట్ల సున్నా వడ్డీ కింద లోన్లను మంజూరు చేసి చిరు, వీధి వ్యాపారుల కళ్లల్లో వెలుగులు నింపామన్నారు.
3.67లక్షల లబ్ధిదారులకు రెండోసారి రుణాలు
3.95లక్షల మంది లబ్ధిదారుల్లో 3.67లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణాలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. కొత్తగా మరో 28వేల మందికి సున్నా వడ్డీలు ఇస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. చిరువ్యాపారులు, వీధివ్యాపారులు, చేనేతలు, వృత్తికళాకారులకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తోందన్నారు జగన్మోహన్ రెడ్డి.
చిరు వ్యాపారులతో సొసైటికి మేలు
‘జగనన్న తోడు’ కింద లబ్ధి పొందుతున్న చిరువ్యాపారులు సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ కింద పదిమందికి సాయం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అందుకే వాళ్ల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా 15,31,347 మందికి.. రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారు. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని చెప్పారు.
పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాలు చూసి చలించిపోయాను
తన పాదయాత్ర సమయంలో చిరువ్యాపారుల కష్టాలు కళ్లారా చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వీధుల్లో వ్యాపారం చేసుకుని వారికే పెట్టుబడి ఎంతో కష్టమని గుర్తించి, ఆ కష్టానికి పర్మినెంట్ సొల్యూషన్ చూపించాలనే ఆశయంతో “జగనన్న తోడు” పథకంతో అందరికి మంచి జరగాలని అడుగులు వేసినట్టు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం.. చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఎలా అండగా నిలబడిందనేది ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం జగన్‌కు వివరించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతోపాటు లబ్ధిదారులు తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు.