(Source: ECI/ABP News/ABP Majha)
Job News: ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. సిబ్బంది కొరత మాటే రాకూడదంటూ హెచ్చరిక
జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. కోవిడ్, ఫిబ్రవరిలో అమలు చేయనున్న పథకాల సన్నద్ధతపైనా సూచనలు చేశారు.
కోవిడ్ రోగుల రికవరీ రేటు ప్రస్తుతం బాగానే ఉందని పాజిటివిటీ రేటు కూడా బాగా తగ్గిందని సీఎం జగన్ చెప్పారు. ఇదివరకు ఉన్న ఆంక్షలను కొనసాగిస్తున్నామనియ.. మరో 2 వారాలపాటు రాత్రిపూట కర్ఫ్యూను, ఆంక్షల నోటిఫికేషన్ వచ్చినట్టు తెలిపారు. నైట్ కర్ఫ్యూ విధిస్తూనే మాస్క్ ధరించకపోతే ఫైన్ విధించడం, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలన్నారు. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో కోవిడ్ నిబంధనలు, సోషల్ డిస్టేన్స్ పాటింపజేయాలన్నారు.
ఇంటింటికీ వెళ్లి చేస్తున్న ఫీవర్ సర్వే కొనసాగించాలని సూచించారు వైఎస్ జగన్. సర్వే చేస్తున్న తీరును కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. కుటుంబాల వారీగా వాక్సినేషన్ అందిందా? లేదా? చూడాలన్నారు. ఫీవర్‌సర్వేలో వాక్సినేషన్ ఒక భాగం కావాలని సీఎం ఆదేశించారు. 45 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసు అందించే విషయంలో కాలపరిమితిని తగ్గించాల్సి ఉందన్న జగన్.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. పశ్చిమ దేశాల తరహాలో కాలపరిమితి పెట్టాలని కోరినట్టు పేర్కొన్నారు.
సిబ్బంది కొరతన్న మాటే రాకూడదు
వైద్య, ఆరోగ్యశాఖలో డాక్టర్లు, సిబ్బంది సహా పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నామని చెప్పారు జగన్. ఆరోగ్యశాఖలో 39 వేలమందిని నియమిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ 27 వేలమందిని రిక్రూట్ చేశామని మిగిలిన వారిని ఈనెలాఖరులోగా నియమించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశించారు.
జిల్లాలోని బోధనాసుపత్రి నుంచి ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, విలేజ్ క్లినిక్ వరకూ 100 శాతం రిక్రూట్‌మెంట్ పూర్తి కావాల్నారు సీఎం. డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పారామెడికల్‌సిబ్బంది లేరనే మాట వినకూడదన్నారు. ప్రతి ఆసుపత్రిలోనే తగినంతమంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది ఉండాల్సిందేనని తెలిపారు. మార్చి 1 నుంచి ఈవిషయంలో కలెక్టర్లను బాధ్యులుగా చేస్తానని హెచ్చరించారు. బదిలీలుకానీ, నియామకాలు కానీ ఇప్పుడు పూర్తి చేయాలని మార్చి 1 నుంచి ఎక్కడా సిబ్బంది లేరనే మాట వినకూడదన్నారు. ఉండాల్సిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఉండాల్సిందేనన్న జగన్.. ఈవిషయంలో ఎక్కడా కూడా ఫిర్యాదులు ఉండకూడదని తేల్చి చెప్పారు.
కలెక్టర్లే కాదు, ఆరోగ్యశాఖ అధికారులను కూడా ఈ విషయంలో బాధ్యులవుతారని హెచ్చరించారు సీఎం. సిబ్బంది హాజరు, వారు విధులు నిర్వర్తించడం, ఆస్పత్రులకు అందుబాటులో ఉండడం అన్నీకూడా సక్రమంగా జరగాలని తెలిపారు. ప్రతిశాఖలోనూ ఇది అమలు కావాలని... దీనివల్ల 90శాతం సమస్యలు తీరిపోతాయిని అభిప్రాయపడ్డారు. దీనికోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోమని సీఎస్‌కు సూచించారు.
ప్రజలకు సేవ చేసేందుకే అధికారంలో ఉన్నామని ఈ విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. అందుబాటులో ఉండడంతోపాటు, సమస్యలు చెప్పేవారిపట్ల సానుభూతితో ఉండాలని హితవుపలికారు. ఇది ప్రతి ఉద్యోగి బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. దీనివల్ల చాలావరకు సమస్యలు తీరిపోతాయని అభిప్రాయపడ్డారు. అందుకనే కావాల్సిన సిబ్బందిని పెట్టుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు.
రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు వర్తించే జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన నిధులను ఫిబ్రవరి 8న సీఎం జగన్ విడుదల చేయనున్నారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ఇచ్చే వైఎస్‌ఆర్ ఇన్‌పుట్ సబ్సిడీ ఫిబ్రవరి 15న విడుదల చేయనున్నారు. ఒక సీజన్‌లో జరిగిన నష్టాన్నిఅదే సీజన్‌లో ఇవ్వాలన్న కాన్సెప్ట్‌తో ఈ పథకాన్ని డిజైన్ చేశారు. డిసెంబర్‌లో రైతులకు జరిగిన నష్టానికి పరిహారం ఫిబ్రవరిలో ఇస్తున్నారు. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చే పథకం జగనన్న తోడు నిధులను ఫిబ్రవరి 22న విడుదల చేస్తారు. ఇప్పటికే 10లక్షలకు వర్తింప జేశారు. అదనంగా మరో 6 లక్షలమందికి వర్తింప చేయనున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున విద్యా దీవెన నిధులు.. మార్చి 22న వసతి దీవెన నిధులు విడుదల చేస్తారు.